116 మంది మృతి చెందినట్లు అనుమానం
ఆఫ్రికాలోని ఉత్తర మాలిలో గల్లంతు
అల్జీర్స్: మరో విమానం కుప్పకూలిందా? వారం కిందట మలేసియా విమానం పేల్చివేత, బుధవారం తైవాన్ విమానం కుప్పకూలిన ఘటనలను మరవకుండానే మూడో విమాన దుర్ఘటన చోటుచేసుకుంది! ఆఫ్రికా దేశమైన అల్జీరియాకు చెందిన ఎండీ-83 అనే ఎయిర్ అల్జీరీ విమానం గురువారం మాలి దేశంలోని ఉత్తర ప్రాంతం మీదుగా ప్రయాణిస్తూ గల్లంతైంది. దీంతో ఈ విమానం కూలిపోయి ఉండొచ్చని... అందులోని 116 మంది మృతిచెంది ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు.
బుర్కినా ఫాసో రాజధాని ఔగాడౌగో నుంచి 1:17 గంటలకు (స్థానిక కాలమానం) అల్జీరియా రాజధాని అల్జీర్స్‌కు బయలుదేరిన 50 నిమిషాల అనంతరం విమానం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో సంబంధాలను కోల్పోయిందని అధికారులు చెప్పారు. విమానంలో 50 మందికిపైగా ఫ్రాన్స్ జాతీయులు, 27 మంది బుర్కినా ఫాసో జాతీయులతోపాటు మరో 12 దేశాలకు చెందిన ప్రయాణికులు ఎక్కారన్నారు.
విమానం ఆచూకీ కనుగొనేందుకు అల్జీరియా, ఫ్రాన్స్ ప్రభుత్వాలు యుద్ధ విమానాలను రంగంలోకి దించాయన్నారు. మాలి, నైజర్ దేశాల పరిధిలోని ఎడారిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయన్నారు. ప్రయాణ మార్గంలో భారీ వర్షం కురుస్తున్నందువల్ల విమాన దిశను మార్చుకునేందుకు అనుమతివ్వాలంటూ నైజర్ దేశంలోని ఏటీసీకి పైలట్ నుంచి చివరి సందేశం అందిందని బుర్కినా ఫాసో ప్రభుత్వం తెలిపింది. ఈ విమానం స్విఫ్ట్ ఎయిర్‌కు చెందిందని స్పెయిన్ పైలట్ల యూనియన్ తెలిపింది.
తైవాన్ విమానం బ్లాక్‌బాక్స్‌లు లభ్యం
మగాంగ్: తైవాన్‌లో బుధవారం కుప్పకూలిన ట్రాన్స్‌ఏసియా ఎయిర్‌వేస్ విమానానికి చెందిన బ్లాక్‌బాక్సులను అధికారులు గురువారం కనుగొన్నారు. ఘటనాస్థలి సమీపంలో లభించిన వీటిని స్వాధీనం చేసుకున్నారు. బ్లాక్‌బాక్స్‌ల ద్వారా ఈ ప్రమాదానికి కారణం తెలిసే అవకాశం ఉందన్నారు. ఈ ప్రమాదంలో 48 మంది మృతిచెందడం తెలిసిందే.
కూలిన అల్జీరియా విమానం!
Published Fri, Jul 25 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM
Advertisement
Advertisement