బీజింగ్ : ప్రపంచ దేశాలను వణికిస్తున్న మహమ్మారి చైనాలోని వుహాన్ ల్యాబ్‌లోనే పురుడు పోసుకుందా..? అసలు దీని మూలాలెక్కడ..ప్రాణాంతక వైరస్ వెనుక మానవ ప్రయత్నం ఉందా..? ఈ ప్రశ్నలపై వైరస్ కేంద్రంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వుహాన్ ల్యాబ్ అధిపతి స్పందించారు. కరోనా వైరస్ చైనా నగరం వుహాన్ లేబొరేటరీలో పురుడుపోసుకుందన్న వాదనలు నిరాధారమని ఆ ల్యాబ్ హెడ్ స్పష్టం చేశారు. అసలు ఈ వ్యాధి ఎక్కడ మొదలైందన్నది ఇప్పటికీ ఎవరికీ అంతుబట్టలేదని అన్నారు. తమ ల్యాబ్‌పై ఊహాజనిత ప్రచారంతో ఎలాంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారని వుహాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యూఐవీ) డైరెక్టర్ ప్రొఫెసర్ యువాన్ జిమింగ్ అన్నారు.
తాజా కరోనా వైరస్‌ను సృష్టించే ఉద్దేశం, ఆ సామర్థ్యం డబ్ల్యూఐవీకి లేదని ఓ వార్తాసంస్ధకు పంపిన లిఖితపూర్వక సమాధానాల్లో స్ఫష్టం చేశారు. సార్స్-కోవిడ్-2 జీనోమ్ మానవ మేథస్సు నుంచి వచ్చిందనే సమాచారం ఎక్కడా లేదని అన్నారు. ప్రస్తుతం వ్యాపిస్తున్న అంటు వ్యాధుల్లో 70 శాతానికి పైగా జంతువుల నుంచి ముఖ్యంగా అటవీ జంతువుల నుంచే సంక్రమిస్తున్నాయని యువాన్ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా మానవులు, అటవీ జంతువుల మధ్య సన్నిహిత సంబంధాలు, అంతర్జాతీయ వాతావరణ మార్పుల వల్ల ముప్పు పెరుగుతుండటాన్ని మనం గమనించవచ్చని అన్నారు. మరోవైపు పరిశోధనల కోసం గబ్బిలాల్లో పెంచిన కరోనా వైరస్‌ను వుహాన్ ల్యాబ్ అనుకోకుండా విడుదల చేసిందన్న కుట్ర సిద్ధాంతకర్తల వాదనలనూ ఆయన తోసిపుచ్చారు. తమ ల్యాబ్‌లో బయో భద్రతా ప్రమాణాలు అత్యంత కఠినంగా అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కాగా, ప్రపంచానికి తెలిసిన ఏడు కరోనా వైరస్‌లు గబ్బిలాలు, ఎలుకలు, పెంపుడు జంతువుల నుంచి పుట్టుకొచ్చాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
చదవండి : కరోనా: 24 వేల టెస్టింగ్ కిట్లు వాపస్
అంటువ్యాధులు ప్రబలినప్పుడు వైరస్ పుట్టుకపై శాస్త్రవేత్తల మధ్య భిన్న వాదనలు చోటుచేసుకోవడం మామూలేనని ఆయన తీసిపారేశారు. వైరస్‌ల పుట్టుకపై ఇప్పటికీ ఎలాంటి సమాధానాలు లేవని అన్నారు. వైరస్ మూలాలను పసిగట్టడం సవాళ్లతో కూడిన శాస్త్రీయ ప్రశ్నగా మారిందని ఇందులో అనిశ్చితి ఎప్పటికీ ఉంటుందని యువాన్ పేర్కొన్నారు. కరోనా మహమ్మారిపై అంతర్జాతీయ దర్యాప్తునకు వుహాన్ ల్యాబ్ సహకరిస్తుందా అని ప్రశ్నించగా తమ ల్యాబ్ పారదర్శకతకు కట్టుబడి ఉందని, కరోనా వైరస్‌పై అందుబాటులో ఉన్న సమాచారాన్ని సమయానుకూలంగా పంచుకునేందుకు సిద్ధమని చెప్పారు. వైరస్ మూలలను పసిగట్టేందుకు ప్రతిఒక్కరూ తమకున్న అనుమానాలు, పక్షపాతాలను పక్కనపెట్టి హేతుబద్ధతతో కూడిన వాతావరణం కల్పించేలా సహకరిస్తారని ఆశిస్తున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment