సైలెన్సర్‌లో ఇరుక్కున్న తలను బయటకు తీస్తున్న ఫైర్ ఫైటర్స్
న్యూయార్క్ : అమెరికాకు చెందిన ఓ యువతి చేసిన పిచ్చి పని కొద్ది గంటల పాటు ఆమెను ఇబ్బందుల పాలు చేసింది. ట్రక్కు సైలెన్సర్ పెద్దదిగా ఉండటంతో తాగిన మైకంలో ఉన్న ఆ యువతి అందులో తలను దూర్చింది. కొద్ది సేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా ప్రయోజనం లేకపోయింది. అలా కొద్ది గంటల పాటు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయి ఇబ్బంది పడాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కైట్లీన్ స్ట్రోం(19) అనే యువతి విన్‌స్టక్ మ్యూజిక్ ఫెస్టివల్‌కు వెళ్లి అక్కడ పూటుగా మద్యం సేవించింది. తాగిన మైకంలో ఉన్న ఆమె అక్కడున్న ట్రక్కు సైలెన్సర్‌ను చూసింది. పెద్దగా ఉన్న ఆ సైలెన్సర్‌లో తలను దూర్చితే ఎలా ఉంటుందని ఆలోచించి.. అనుకున్నదే తడువుగా అందులోకి తలను దూర్చింది.
కొద్దిసేపటి తర్వాత తల బయటకు తీద్దామన్నా కుదరలేదు. ఇది గమనించిన అక్కడి వారు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అగ్ని మాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి గ్యాస్ కట్టర్‌ల సహాయంతో ఆమె తలను సురక్షితంగా బయటకు తీశారు. చావు తప్పి కన్ను లొట్టపోయినట్లైంది ఆ యువతి పరిస్థితి. ఇది ఇలా ఉంటే చిన్న వయస్సులో మద్యం సేవించినందుకు ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. సైలెన్సర్‌లో తల ఇరుక్కున్నప్పటి దృశ్యాలు కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ మారాయి. దీంతో కైట్లీన్ స్ట్రోం స్పందిస్తూ.. తాను చేసిన పనికి ఏమాత్రం బాధపడటం లేదని ట్రక్కు సైలెన్సర్‌లో తల ఇరుక్కుపోయిన యువతి తానేనంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment