అక్కడ యూత్ ఇప్పుడు హ్యాప్పీ!
లండన్: ఆర్థిక వ్యవహారాల్లో సాధించిన పురోగతిపై ఇప్పుడు బ్రిటన్ యువత సంతృప్తి వ్యక్తం చేస్తోంది. 2013-14, 2014-15 ఆర్థిక సంవత్సరాల్లో తగినంత ఆదాయం, ఆదాయ మార్గాలు లేక తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొని అసంతృప్తిలో మగ్గిన యువత తమ ప్రస్తుత స్థితిపై మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్(ఓఎన్ఎస్) వెల్లడించింది.
16 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉన్న యువత అభిప్రాయాలు తీసుకొని ఓఎన్ఎస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2012 నుంచి 2015 మధ్య కాలంలో బ్రిటన్లో 16 నుంచి 24 ఏళ్ల మధ్యగల యువకుల్లో నిరుద్యోగ శాతం అత్యధికంగా 20 శాతంకు కూడా చేరుకుందని ఈ సంస్థ వెల్లడించింది. అయినప్పటికీ ఇప్పుడు పెరుగుతున్న ఆర్థిక అవకాశాలతో యువత సంతృప్తికరంగా ఉన్నారని ఓఎన్ఎస్ తెలిపింది. ఇదే సమయంలో వయోజనులతో పోల్చినప్పుడు అప్పుడే సంపాదన ప్రారంభించిన యువకుల్లో ఆదాయం అధికంగా ఉంటుందని సంస్థ వెల్లడించిన గణాంకాల్లో తేలింది.