ప్రస్తుతం ఆన్‌లైన్‌కు ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు. సమస్త సమాచారమూ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటోంది. వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించే ఆన్‌లైన్‌ను సరిగ్గా వినియోగించకుంటే ఆదాయం కూడా పొందొచ్చని నిరూపిస్తున్నారు కొందరు. బ్లాగ్‌లు, వెబ్‌సైట్లు, యూట్యూబ్ చానళ్లు.. ఇలా పలు మార్గాల ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఆన్‌లైన్ ద్వారా భారీగా ఆదాయాన్ని పొందుతున్న కొందరి గురించి తెలుసుకుందాం..
జానీ వార్డ్(రోజుకు వెయ్యి డాలర్లు)
ఉత్తర ఐర్లాండ్‌కు చెందిన జానీ వార్డ్ పేద కుటుంబానికి చెందిన వాడు. గ్రాడ్యుయేషన్ పూర్తి అయిన తర్వాత 25 ఏళ్ల వయసులో ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. ఈవెంట్లు ఆర్గనైజ్ చేయడం అతడి పని. అప్పుడు జానీ నెల జీతం 20,000 డాలర్లు. అయితే జానీకి అటు ఉద్యోగం, ఇటు సంపాదన రెండూ సంతృప్తిని అందివ్వలేదు. అతడికి ప్రపంచాన్ని చుట్టి రావాలని కోరిక. దీంతో పాటే ఆదాయమూ పొందాలనుకున్నాడు. వెంటనే ఉద్యోగానికి స్వస్తి పలికి, వన్‌స్టెప్4 వార్డ్ అనే ఓ బ్లాగ్‌ను ప్రారంభించాడు. వెంటనే జింబాబ్వేకు ప్రయాణం ప్రారంభించాడు. అక్కడి విశేషాలను తన బ్లాగ్‌లో పొందుపరిచేవాడు. దీంతో ఈ ట్రావెల్ బ్లాగ్‌కు మంచి ఆదరణ లభించింది. ఇక అప్పటినుంచి అనేక దేశాలను సందర్శిస్తూ, వాటి విశేషాలను బ్లాగ్‌లో వెల్లడించేవాడు. అలా జానీ ప్రారంభించిన ట్రావెల్ బ్లాగ్‌ను ఎంతోమంది అనుసరిస్తున్నారు. ఈ బ్లాగ్‌కు విశేష ఆదరణ లభించడంతో దీని ద్వారా ప్రస్తుతం రోజుకు వెయ్యి డాలర్ల వరకు సంపాదిస్తున్నాడు. వారానికి కొన్ని గంటలు మాత్రమే బ్లాగ్‌కోసం కేటాయిస్తాడు. ఇప్పటివరకు మిలియన్ డాలర్లకు పైగా ఆర్జించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 193 దేశాల్లో జానీ ఇప్పటివరకు 152 దేశాలను సందర్శించాడు. బ్లాగ్ ద్వారా అటు ఆన్‌లైన్‌లో డబ్బు సంపాదిస్తూ, ఇటు విదేశాల్ని చుట్టిరావాలన్న తన కోరికనూ తీర్చుకుంటున్నాడు. పేద కుటుంబంలో జన్మించిన జానీ ప్రస్తుతం బ్యాంకాక్, థాయ్‌లాండ్, లండన్‌లలో సొంత ఇల్లు కలిగి ఉన్నాడు. బ్లాగ్ ప్రారంభించడం సులభమే అయినప్పటికీ, దాని ద్వారా ఎలా ఆదాయం పొందాలో తెలిసుండాలని జానీ సూచిస్తున్నాడు.
ఫెలిక్స్ అర్విడ్ (ఏడాదికి రూ.యాభై కోట్లు)..
వీడియోగేమ్స్ చాలా మంది ఆడేస్తుంటారు. సరదా కోసం ఆడే వీడియోగేమ్స్‌తో డబ్బు సంపాదించుకోవచ్చు అని నిరూపించాడు స్వీడన్‌కు చెందిన ఫెలిక్స్ ఎర్విడ్. ఇతడికి కూడా చిన్నప్పటి నుంచి వీడియోగేమ్స్ ఆడడం చాలా ఇష్టం. ఫెలిక్స్ యూట్యూబ్‌లో ప్యూడైపై పేరుతో ఓ చానల్ ప్రారంభించాడు. ఈ చానల్‌కు ప్రస్తుతం దాదాపు ఐదు కోట్ల వరకు వీక్షకులు ఉన్నారు. ఇంతకీ అతడు ఈ చానల్‌లో ఏం చేస్తాడనుకుంటున్నారా? తను ఆడే వీడియోగేమ్స్‌కు సంబంధించిన దృశ్యాలను అందులో అప్‌లోడ్ చేయడమే. హర్రర్, యాక్షన్ వీడియో గేమ్స్ ఆడుతూ, అతడు చేసే విన్యాసాలు వీక్షకులను అలరిస్తున్నాయి. అయితే చాలా మంది ఫెలిక్స్ చేసే విన్యాసాలను విమర్శిస్తుంటారు కూడా. అయితేనేం.. కోట్ల మంది వీక్షకులు ఆ చానల్‌ను ఆదరిస్తున్నారు. దీంతో అతడికి యాడ్స్ రూపంలో భారీగా ఆదాయం వస్తోంది. ఫెలిక్స్ సంవత్సరానికి రూ. 50 కోట్ల వరకు ఆర్జిస్తున్నాడు.
ద దివా (నెలకు రూ.1,000 డాలర్లు)
చాలా మందికి ఇతరులు చూస్తుండగా భోజనం చేయాలంటే చాలా ఇబ్బంది. అయితే దక్షిణ కొరియాకు చెందిన పార్క్ సియో యెన్ మాత్రం అలా అందరిముందూ భోజనం చేస్తూ వేల డాలర్లు ఆర్జిస్తోంది. అదీ ఆన్‌లైన్‌లో. యెన్ గతంలో ఓ కన్సల్టెన్సీ సంస్థలో ఉద్యోగం చేసేది. కొంతకాలం తర్వాత ఆ ఉద్యోగాన్ని వదిలేసి తనకు ఇష్టమైన పని చేయాలనుకుని వినూత్నంగా ఆలోచించింది. ఆమెకు భోజనం చేయడం అంటే మహా ఇష్టం. పెద్దమొత్తంలో ఆహారాన్ని ప్రతిసారీ గంటకుపైనే తినేది. అయితే దీన్ని ఒంటరిగా కాకుండా, కెమెరా ముందు చేయాలనుకుంది. వెంటనే తను భోజనం చేసే ప్రతిసారీ ఆన్‌లైన్‌లోకి వచ్చేది. అలా ఆన్‌లైన్‌లో ద దివా పేరుతో చాలామందితో చాట్‌చేస్తూ, లైవ్ స్ట్రీమింగ్‌లో భోజనం చేస్తుండేది. భారీ ఆహారం తింటూ, రోజూ నాలుగైదు గంటలు ఆన్‌లైన్‌లోనే గడిపేది. చివరకు ఈమె భోజనాన్ని లైవ్‌లో వీక్షించే వారి సంఖ్య లక్షలకు చేరింది. దీంతో యాడ్స్ పెరిగి యెన్‌కు మంచి ఆదాయం లభించింది. యెన్‌కు ఇలాంటి ఆలోచన రావడానికి కారణం కొరియన్లు ఒంటరిగా తినడాన్ని ఎక్కువగా ఇష్టపడరు. ఈమె ఆహారానికి నెలకు 3,000 డాలర్లు (రూ.20 వేలు) ఖర్చవుతుంది. అయితే ఆన్‌లైన్ యాడ్స్ ద్వారా ఈమె సంపాదన నెలకు 10,000 డాలర్లకు పైగానే ఉంది. పైగా ఈమె భోజనానికి అయ్యే ఖర్చులో కొంతభాగాన్ని పలువురు స్పాన్సర్లు అందించడం విశేషం.
లారా మెల్లర్స్..
బ్రిటన్‌కు చెందిన లారా మెల్లర్స్ యూట్యూబ్ చానల్ ద్వారా ఆదాయం సంపాదిస్తోంది. ఈమె గతంలో ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసి, రిటైర్ అయింది. గినియా పందులు అంటే ఆమెకు ఎంతో ఇష్టం. ఇవి సాధారణ పందులతో పోలిస్తే చాలా భిన్నమైనవి. వీటని ఎంతో ఇష్టంగా చూసుకునేది. ఆ ఇష్టంతోనే వీటి పెంపకానికి సంబంధించిన దృశ్యాల్ని లారా యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేసింది. దీంతో కొద్ది రోజుల్లోనే ఈ వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ఇలా ప్రతివారం ఈ పందుల పెంపకాన్ని వీడియో తీసి, తన యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంది. వీక్షకులు పెరగడంతో యాడ్స్ ద్వారా ప్రతి నెలా దాదాపు నాలుగు వేల వరకు డాలర్లు ఆర్జిస్తోంది.
ఆన్‌లైన్‌లో ఆర్జిస్తున్నారు..
Published Mon, Jun 6 2016 9:58 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
Advertisement