నాలుకకు మెదడు రక్షణ..
మనం తినే ఆహారం రుచి చెప్పడమే కాకుండా.. ఆ ఆహారాన్ని నోట్లో ఒక పక్క నుంచి మరో పక్కకు మారుస్తూ నాలుక కీలకమైన పాత్ర పోషిస్తుందన్న విషయం మనకు తెలిసిందే. మనం నములుతున్నపుడు మన దృష్టి ఆహారం పైనే ఉంటుంది తప్ప నాలుక ఎలా కదులుతోందో గుర్తించం. అయితే ఆహారం నములుతున్నపుడు పదునైన పళ్ల మధ్య నలిగి పోకుండా నాలుక చాకచక్యంగా ఎలా తప్పించుకుంటుంది? ఈ విషయంపై అమెరికాలోని డ్యూక్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు నాలుకను రక్షించేదెవరో కనుగొన్నారు.
మెదడులో పరస్పర అనుసంధానితమైన నాడీకణాలు దవడ, నాలుక కదలికలను నియంత్రిస్తున్నాయని చెప్పారు. ఆ నాడీకణాల సమన్వయంతోనే నాలుక గాయపడకుండా తప్పించుకోగలుగుతోందన్నారు. ‘‘మీరు నములుతున్నపుడు నాలుకపై నుంచి దృష్టిని ఎప్పుడు మరల్చారో అప్పుడు మెదడులోని అనుసంధానిత నాడీకణాలు రంగంలోకి దిగుతాయి’’ అని డ్యూక్ వర్సిటీకి చెందిన ఎడ్వర్డ్ స్టానెక్ చెప్పారు. గత పరిశోధనల్లో నాలుక రక్షణకు దవడ, నాలుక కండరాల్లోని మోటో నాడీకణాలు, వాటిని నియంత్రించే మరో జత ప్రీ మోటార్ నాడీకణాలు తోడ్పడతాయని తేలింది.