భీంరాజ్‌పల్లి పంచాయతీ కార్యాలయం
సాక్షి, గొల్లపల్లి: మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. 27 పంచాయతీలకు కేవలం నలుగురే ఉండడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. వారు వచ్చారు కానీ వారికి సహకరించేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు.
పూర్తిస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతో పంచాయతీలకు వచ్చే నిధులు, వాటి ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసే వాళ్లు లేరు. కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్‌లు ఇన్‌చార్జి అధికారులపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. దీంతో వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక, పనులు ముందుకు సాగక పాలన కుంటుపడుతోంది. దీంతో సర్పంచ్‌లు పనులు చేయలేక ఖాళీగా కూర్చుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు.
కొత్త కార్యదర్శులు వచ్చేదెన్నడు..
మండలంలో కొత్తగా 2 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నూతన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకం చేపట్టింది. అయితే కోర్టు కేసు కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కొత్త కార్యదర్శులు ఇంకా గ్రామాలకు రాలేదు. కార్యదర్శుల కొరతతోపాటు భవనాలు లేక చిన్న గదుల్లో పాలన సాగిస్తున్నారు.
కార్యదర్శులు లేకపోవడంతో సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గాలు దృష్టి సారించడం లేదు. పంచాయతీలకు కావాల్సిన నిధులపై అవగాహన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మొన్నటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడంతో అభివృద్ధి పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం సిబ్బంది కొరతతో అభివృద్ధి జరగడం లేదు.
అదనపు బాధ్యతలు
మండలంలో 27 గ్రామ పంచాయతీలకు కేవలం ముగ్గురు కార్యదర్శులు, ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. దీంతో వారిపై పనిభారం భారీగా పడింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మల్లేషం అబ్బాపూర్, ఆత్మకూర్, దమ్మన్నపేట, లక్ష్మీపూర్, రంగదామునిపల్లి, చిల్వాకోడూర్, బొంకూర్, వెన్గుమట్ల, ఇస్రాజ్‌పల్లికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.మల్లేశంకు దట్నూర్, చెందోళి, భీంరాజ్‌పల్లి, తిర్మాళాపూర్(పీడి), అగ్గిమల్ల, గంగాదేవిపల్లి, రాఘవపట్నం, లొత్తునూర్‌కు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు.
తిరుపతికి రాపల్లి, నందిపల్లి, వెంగళాపూర్, శంకర్‌రావుపేట, తిర్మాళాపూర్(ఎం), బీబీ రాజ్‌పల్లి, గొల్లపల్లి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్ గోవింద్‌పల్లి, గుంజపడుగు, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో పని చేస్తున్నారు. వీరంతా ఇన్ని పంచాయతీలు ఎలా పర్యవేక్షిస్తున్నారో వారికే తెలియాలి. కొత్త పంచాయతీరాజ్æ చట్టంలో అనేక మారులను తీసుకొచ్చారు. కార్యదర్శికి 30 రకాల బాధ్యతలు అప్పగించారు. దీంతో గ్రామీణ ప్రజలు సమస్యల పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కార్యదర్శులను నియమించాలి
ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలి. అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్‌చార్జి కార్యదర్శులతో గ్రామంలో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. కార్యదర్శి ఉంటేనే నిధులు, విధులు మాకు తెలుస్తాయి. అప్పుడే గ్రామ పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించాలి.
– పురంశెట్టి పద్మ, సర్పంచ్, అబ్బాపూర్
అధికారుల దృష్టికి తీసుకెళ్లాం
మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఉన్నవారికి అదనపు గ్రామాల బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నాం. కొత్త కార్యదర్శులు వచ్చేవరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇన్‌చార్జీలు కొనసాగుతారు.
– నవీన్‌కుమార్, ఎంపీడీవో, గొల్లపల్లి
Comments
Please login to add a commentAdd a comment