darmapuri
-
ఫైనాన్స్ పేరుతో మోసం.. కోటిన్నరతో పరార్
సాక్షి, వెల్గటూరు(ధర్మపురి): కోటిన్నర మేర అప్పులు చేసిన లిక్కర్ వ్యాపారి పరార్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ధర్మారం టౌన్‌కు చెందిన వ్యక్తి చిట్టీలు, ఫైనాన్స్ నిర్వహిస్తున్నాడు. అర్ధరాత్రి అత్యవసర పరిస్థితిలో రూ.లక్ష అయినా ఉన్నఫలంగా ఇచ్చేవాడు. ఇలా ప్రజల్లో మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రజల అత్యాశను ఆసరా చేసుకుని అధిక వడ్డీ ఇస్తానని, వైన్స్‌లో షేరు ఇస్తానని చెప్పి çసుమారు 40 మంది దగ్గర రూ.కోటిన్నర వరకు చిట్టీలు అప్పులు తెచ్చి ఉడాయించిన విషయం వెల్గటూర్, ధర్మారం మండలాల్లో సంచలనం రేపింది. బాధితులు మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును కలసి మొరపెట్టుకున్నారు. డబ్బు ఇచ్చిన వారంతా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు. వెల్గటూరు మండలం పాతూగూడూరు గ్రామానికి చెందిన వ్యక్తి ఐదేళ్లక్రితం ఇక్కడికి వచ్చాడు. ధర్మారం మండలకేంద్రంలో లిక్కర్, ఫైనాన్స్ వ్యాపారంలో స్థిరపడ్డాడు. మార్కెట్లో మంచిపేరు తెచ్చుకున్నాడు. ధర్మారంలో వీరి గ్రూపు వైన్స్ ఏర్పాటు చేయగా అందులో షేర్ ఇస్తామని నమ్మించి అప్పులు తెచ్చాడు. చిట్టీలు ఇవ్వకుండా అతడి వద్దే ఉంచుకుని వడ్డీకి ప్రామిసరీ నోట్లు రాసిచ్చాడు. నగదు ఇచ్చిన వారు సుమారు 40 మంది వరకు ఉన్నారు. వీరి నుంచి రూ.1.5 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. వైన్స్ గడువు దసరాతో ముగిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి డబ్బు కావాలని ఒత్తిడి పెరిగింది. దీంతో సెప్టెంబర్ 13న ధర్మారం నుంచి అర్ధరాత్రి బిచానా ఎత్తేశాడు. బాధితులు కొన్నినెలల నుంచి ఆందోళన చెందుతున్నారు. అంతా పేదవారే... బాధితులంతా పేదవారే. రాజారాంపల్లి గ్రామానికి చెందిన రాకేశ్ అనే యువకుడి తల్లి చనిపోగా బీమా డబ్బు రూ.5లక్షలు వచ్చాయి. అకౌంట్లోకి మనీ ట్రాన్స్ఫర్ చేయించుకున్న రెండురోజులకే కనిపించకపోయాడు. సూరారాంకు చెందిన మాదాసు రాములు ,ఆత్మకూరుకు చెందిన లచ్చన్న,సంతోశ్ ,రూ.5లక్షలు ,రూ12 లక్షలు ఇచ్చిన వారున్నారు. కూరగాయలు అమ్మి కూడబెట్టుకున్న సొమ్ము రూ.12లక్షలు తీసుకున్నాడని పాతగూగూరు గ్రామానికి చెందిన పొనుగోటి శ్యామల రోదిస్తూ తెలిపింది. కూతురు పెళ్లి కోసమని రూ.10 లక్షలు కూడబెట్టా, డబ్బు రాకపోతే మరణమే శరణ్యమని మరో బాధితుడు వాపోయాడు. మాజీ ఎంపీపీకి మొరపెట్టుకున్న బాధితులు పాతగూడూరులోని వ్యాపారి తల్లిదండ్రి, భార్యాపిల్లలు నివాసం ఉంటున్నారు. అతడు నాలుగునెలలుగా కనిపించలేదు. ఇన్నాళ్లు వేచి ఉన్న బాధితులు అంతాకలసి గురువారం పాతగూడురుకు వచ్చిన మాజీ ఎంపీపీ పొనుగోటి శ్రీనివాసరావును న్యాయం చేయాలని మొరపెట్టుకున్నారు. వ్యాపారి తండ్రి బొల్లం మల్లయ్యను పిలిచి బాధితులకు ఎలాగైనా న్యాయం చేయాలని మాజీ ఎంపీపీ సూచించారు. కుమారుడి జాడకోసం తండ్రిపై బాధితలు ఒత్తిడి పెంచారు. అతడి భూములు దున్నకుండా అడ్డుకుంటున్నారు. అయితే అప్పులు ఇచ్చేప్పుడు నాకెవ్వరూ చెప్పలేదని నేనెలా బా«ధ్యుడనని తండ్రి తప్పించుకుంటున్నాడు. తనకున్న ఆస్తిలో సగం రాసిస్తానని చెప్పుకొచ్చాడు. ఆస్తి మొత్తం ఇచ్చి నా తీసుకున్న డబ్బుల్లో 20 శాతం కూడా తీరవని బాధితులు వ్యాపారి తండ్రిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇరువర్గాలను మాజీ ఎంపీపీ శాంతిపజేశారు. బాధితులు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని సూచించారు. చివరికి పంచాయితీ స్టేషన్‌కు చేరినట్లు సమాచారం. -
కాంగ్రెస్‌కు ఓటేస్తే నీళ్లల్లో వేసినట్లే..
సుభాష్‌నగర్(నిజామాబాద్‌అర్బన్): పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే నీళ్లల్లో వేసినట్లేనని, రాష్ట్రంలో ఆ పార్టీ ఖాళీ అవుతోందని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ అన్నారు. శనివారం నగరం లోని మున్నూరుకాపు కల్యాణ మండపంలో పార్లమెంట్ నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అర్వింద్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని మోదీకి బహుమతిగా ఇవ్వడమే లక్ష్యంగా పని చేస్తానని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు టీఆర్ఎస్, బీజేపీల్లో చేరుతున్నారని, రాష్ట్రంలో ఆ పార్టీ ఖాళీ అవడం ఖాయమన్నారు. అర్వింద్ ఫౌండేషన్ ద్వారా 112 మంది చిన్నారుల ప్రాణాలు కాపాడే అదృష్టం కలిగిందన్నారు. ఈనెల 25న ఆర్మూర్‌లో జరిగే బహిరంగసభలో పసుపు రైతులకు తీపి కబురు అందనుందని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. కేం ద్ర ప్రభుత్వం ఐదేళ్లలో అమల్జేసిన సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజలకు వివరించాల్సిన బాధ్యత నాయకులు, కార్యకర్తలదేనని అన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మాట్లాడుతూ ఆర్మూర్ బస్టాండ్ వెనకాలగల మైదానంలో ఈనెల 25న సాయంత్రం 5 గంటలకు బీజే పీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సభకు కేంద్రమంత్రి హర్దీప్సింగ్ పూరీ, జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ హాజరుకానున్నారన్నారు.రైతులు, నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గసభ్యులు యెండల లక్ష్మీనారాయణ, సీనియర్‌నాయకులు లోక భూపతిరెడ్డి, అల్జాపూర్ శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గసభ్యులు బస్వా లక్ష్మీనర్సయ్య, గీతారెడ్డి, ఆయా నియోజకవర్గాల ఇన్చార్జులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
27 పంచాయతీలకు నలుగురే..!
సాక్షి, గొల్లపల్లి: మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత వేధిస్తోంది. 27 పంచాయతీలకు కేవలం నలుగురే ఉండడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికలు పూర్తి కావడంతో కొత్త సర్పంచ్‌లు పదవీ బాధ్యతలు చేపట్టారు. వారు వచ్చారు కానీ వారికి సహకరించేందుకు అధికారులు, సిబ్బంది సరిపడా లేరు. పూర్తిస్థాయిలో పంచాయతీ కార్యదర్శులు లేకపోవడంతో పంచాయతీలకు వచ్చే నిధులు, వాటి ఖర్చుల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసే వాళ్లు లేరు. కార్యదర్శులు లేకపోవడంతో సర్పంచ్‌లు ఇన్చార్జి అధికారులపై ఆధారపడి పాలన సాగిస్తున్నారు. దీంతో వారు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియక, పనులు ముందుకు సాగక పాలన కుంటుపడుతోంది. దీంతో సర్పంచ్‌లు పనులు చేయలేక ఖాళీగా కూర్చుంటున్నారు. ఫలితంగా గ్రామాల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. కొత్త కార్యదర్శులు వచ్చేదెన్నడు.. మండలంలో కొత్తగా 2 గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేశారు. అయితే ప్రభుత్వం నూతన పంచాయతీ కార్యదర్శుల పోస్టుల నియామకం చేపట్టింది. అయితే కోర్టు కేసు కారణంగా ఆ ప్రక్రియ ఆగిపోయింది. దీంతో కొత్త కార్యదర్శులు ఇంకా గ్రామాలకు రాలేదు. కార్యదర్శుల కొరతతోపాటు భవనాలు లేక చిన్న గదుల్లో పాలన సాగిస్తున్నారు. కార్యదర్శులు లేకపోవడంతో సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గాలు దృష్టి సారించడం లేదు. పంచాయతీలకు కావాల్సిన నిధులపై అవగాహన లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో సర్పంచ్‌లు ఉన్నారు. మొన్నటివరకు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండడంతో అభివృద్ధి పూర్తిగా దెబ్బతింది. ప్రస్తుతం సిబ్బంది కొరతతో అభివృద్ధి జరగడం లేదు. అదనపు బాధ్యతలు మండలంలో 27 గ్రామ పంచాయతీలకు కేవలం ముగ్గురు కార్యదర్శులు, ఒక జూనియర్ అసిస్టెంట్ మాత్రమే ఉన్నారు. దీంతో వారిపై పనిభారం భారీగా పడింది. ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న పంచాయతీ కార్యదర్శి మల్లేషం అబ్బాపూర్, ఆత్మకూర్, దమ్మన్నపేట, లక్ష్మీపూర్, రంగదామునిపల్లి, చిల్వాకోడూర్, బొంకూర్, వెన్గుమట్ల, ఇస్రాజ్‌పల్లికి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జి.మల్లేశంకు దట్నూర్, చెందోళి, భీంరాజ్‌పల్లి, తిర్మాళాపూర్(పీడి), అగ్గిమల్ల, గంగాదేవిపల్లి, రాఘవపట్నం, లొత్తునూర్‌కు బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తిరుపతికి రాపల్లి, నందిపల్లి, వెంగళాపూర్, శంకర్రావుపేట, తిర్మాళాపూర్(ఎం), బీబీ రాజ్‌పల్లి, గొల్లపల్లి, జూనియర్ అసిస్టెంట్ రమేశ్ గోవింద్‌పల్లి, గుంజపడుగు, ఇబ్రహీంనగర్ గ్రామాల్లో పని చేస్తున్నారు. వీరంతా ఇన్ని పంచాయతీలు ఎలా పర్యవేక్షిస్తున్నారో వారికే తెలియాలి. కొత్త పంచాయతీరాజ్æ చట్టంలో అనేక మారులను తీసుకొచ్చారు. కార్యదర్శికి 30 రకాల బాధ్యతలు అప్పగించారు. దీంతో గ్రామీణ ప్రజలు సమస్యల పరిష్కారానికి నోచుకోక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యదర్శులను నియమించాలి ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించాలి. అప్పుడే గ్రామాల అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇన్చార్జి కార్యదర్శులతో గ్రామంలో పూర్తిస్థాయిలో పనులు జరగడం లేదు. కార్యదర్శి ఉంటేనే నిధులు, విధులు మాకు తెలుస్తాయి. అప్పుడే గ్రామ పాలన సజావుగా సాగే అవకాశం ఉంది. వెంటనే ప్రభుత్వం కార్యదర్శుల నియామకంపై దృష్టి సారించాలి. – పురంశెట్టి పద్మ, సర్పంచ్, అబ్బాపూర్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మండలంలో పంచాయతీ కార్యదర్శుల కొరత తీవ్రంగా ఉంది. ఈ విషయం జిల్లా అధికార యంత్రాంగం దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం ఉన్నవారికి అదనపు గ్రామాల బాధ్యతలు అప్పగించి పనులు చేయిస్తున్నాం. కొత్త కార్యదర్శులు వచ్చేవరకు ఆయా గ్రామ పంచాయతీలకు ఇన్చార్జీలు కొనసాగుతారు. – నవీన్‌కుమార్, ఎంపీడీవో, గొల్లపల్లి -
అభివృద్ధిపై ఆశలు
సాక్షి, బుగ్గారం: ఒకప్పుడు నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బుగ్గారం ప్రాంతం నుంచి రాష్ట్ర రాజకీయాల్లో మంచి గుర్తింపు పొందిన ఎంతోమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. అయినా బుగ్గారం గ్రామం, దాని చుట్టుపక్కల గ్రామాలు చెప్పుకోదగ్గ అభివృద్ధి సాధించలేదు. తరువాత 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గ కేంద్రాన్ని ధర్మపురికి మార్చారు. దీంతో ఇక అభివృద్ధి ఉండదని గ్రామస్తులు అనుకున్నారు. తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం మొదటిసారి కొలువుదీరిన టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది. ఈ పునర్విభజనలో భాగంగా ధర్మపురి మండలంలో అంతర్భాగంగా ఉన్న బుగ్గారంను ధర్మపురి మండలంలోని 8 గ్రామాలు, గొల్లపల్లి మండలంలోని మూడు గ్రామాలతో కలిపి మొత్తం 11 గ్రామాలతో నూతన మండలకేంద్రంగా ఏర్పాటు చేశారు. దీంతో బుగ్గారంలో తహసీల్దార్ కార్యాలయం, వ్యవసాయ కార్యాలయం, పోలీస్‌స్టేషన్ తదితర కార్యాలయాలు నెలకొల్పారు. స్థానిక ప్రజలకు ప్రభుత్వ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అయితే మండల ప్రజాపరిషత్ సంబంధమైన పనులు మాత్రం ధర్మపురిలోని ఎంపీపీ కార్యాలయం నుంచే జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దరిమిలా పాత ప్రాదేశిక స్థానాల్లో మార్పులు జరిగి నియోజకవర్గంలోని 6 మండలాల్లో 75 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో నూతనంగా ఏర్పడ్డ బుగ్గారం మండలంలో ఈసారి మండల ప్రజాపరిషత్ ఏర్పాటు చేయనున్నారు. దాంతోపాటు మండలం నుంచి నూతనంగా జెడ్పీ స్థానం కూడా ఖరారు చేశారు. 11 గ్రామాలు.. 6 ఎంపీటీసీ స్థానాలు బుగ్గారం మండలంలో మొత్తం 11గ్రామాలకు గానూ 6ఎంపీటీసీ స్థానాలు ఖరారు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 21,716 కాగా.. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ప్రకారం మొత్తం మండల ఓటర్లు 16,493. ఇంతకుముందు ధర్మపురి మండల పరిధిలో ఉన్నప్పుడు బుగ్గారంలోని 8 గ్రామాలకు గానూ 5 ఎంపీటీసీ స్థానాలుండేవి. ప్రస్తుతం గొల్లపల్లి నుంచి కలిసిన మూడు గ్రామాలైన శెకెల్ల, యశ్వంతరావుపేట, గంగాపూర్ గ్రామాలతో మరో ఎంపీటీసీ స్థానాన్ని ఏర్పాటు చేయడంతో మండలంలో మొత్తం ఆరు ఎంపీటీసీ స్థానాలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటు మండలం నుంచి ఈసారి జెడ్పీటీసీ స్థానం కూడా ఏర్పడడంతో స్థానిక సంస్థల పాలన ప్రజలకు మరింత చేరువై సమర్థవంతంగా కొనసాగే అవకాశం ఉంటుందని నాయకులు, ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ధర్మపురి కేంద్రంగా కొనసాగిన పంచాయతీల పాలనా వ్యవహారాలు త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల అనంతరం మండలకేంద్రం నుంచే గ్రామాల పాలనా వ్యవహారాల పర్యవేక్షణ జరుగుతుంది. దీంతో మండలంలో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగి గ్రామాల ముఖచిత్రం మారే అవకాశాలున్నాయి. జెడ్పీ నిధులు కూడా నేరుగా మండలానికే రానుండడంతో అభివృద్ధిలో వేగం పెరిగే అవకాశాలుంటాయని నాయకులంటున్నారు. యువత ఆసక్తి త్వరలో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావహులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తమ బలాబలాలను గురించి లెక్కలు వేసుకుంటూ స్థానిక ప్రజల వద్ద అభిప్రాయాలు సేకరిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓడిపోయిన అభ్యర్థులు, రిజర్వేషన్ అనుకూలించనివారిలో కొంతమందికి ప్రస్తుతం ఖరారు చేసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ రిజర్వేషన్లు కలిసి వస్తుండడంతో మళ్లీ ఎన్నికల సమరంలో దిగడానికి సిద్ధమౌతున్నారు. పార్టీల గుర్తులపై ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక మంది ఔత్సాహికులు తమతమ పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. మరికొంతమంది యువకులు, నాయకులు తమకు పార్టీ టికెట్ రాకున్నా స్వతంత్రంగానైనా పోటీ చేయాలనే యోచనలో ఉన్నారు. తమకున్న కుల బలం, ఇతర అంశాలపై లెక్కలు వేసుకుంటున్నారు. కేవలం 6 ఎంపీటీసీ స్థానాలతో ఏర్పడ్డ చిన్న మండలం కావడంతో మరికొంతమంది ఎంపీపీ స్థానంపై కన్నేశారు. ఇదిలా ఉండగా.. మండలంలోని ఎంపీపీ, జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో పలు పార్టీల పెద్దలు మండలంలోని గెలుపు గుర్రాల కోసం అన్వేషిస్తున్నారు. ప్రజాదరణతోపాటు అంగబలం, ఆర్థిక బలం కలిగిన నాయకుల కోసం పార్టీలు అన్వేషణ సాగిస్తున్నాయి. -
ధర్మపురిలో పుణ్యస్నానాలు
ధర్మపురి : శ్రావణ శుక్రవారం సందర్భంగా ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. వివిధ∙ప్రాంతాల నుంచి ఇరవై వేలకుపైగా భక్తులు తరలివచ్చి గోదావరిలో స్నానాలు ఆచరించారు. అనంతరం దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. గోదావరిలో పేరుకుపోయిన చెత్తాచెదారం ధర్మపురి గోదావరిలోని స్నానఘట్టాల వద్ద చెత్తాచెదారంతో అపరిశుభ్రత నెలకొంది. కొబ్బరిచిప్పలు, బట్టలు, వ్యర్థపదార్థాలను తొలగించేవారు లేక ఘాట్ వద్ద ఇలా దర్శనమిచ్చాయి. -
నేడు బీజేపీ మహాసమ్మేళనం
జ్యోతినగర్ : ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఎల్బీ స్టేడియంలో ఆదివారం నిర్వహించే మహాసమ్మేళనాన్ని విజయవంతం చేయాలని బీజేపీ రామగుండం అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జీ గాండ్ల ధర్మపురి కోరారు. ఎన్టీపీసీ జ్యోతినగర్‌లోని మయూరి హాల్లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. రామగుండం నియోజకవర్గంలోని బూత్‌లెవల్ అధ్యక్ష, కార్యదర్శులు పార్టీ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌కు తరలిరావాలన్నారు. సమావేశంలో కోమళ్ల మహేశ్, గుండెబోయిన లక్ష్మణ్‌యాదవ్, రామన్న, గోపగాని నవీన్, జూల విజయ్‌కుమార్, గణేశ్, చింతల శంకర్, ఎన్రెడ్డి రాజేశ్, సప్ప నాగరాజు, బాగాల స్వామి, కార్యకర్తలు పాల్గొన్నారు.