మండ మెలిగె.. మేడారం వెలిగె | Preparations for Medaram jatara  | Sakshi
Sakshi News home page

మండ మెలిగె.. మేడారం వెలిగె

Published Thu, Jan 25 2018 3:51 PM | Last Updated on Thu, Jan 25 2018 3:51 PM

Preparations for Medaram jatara  - Sakshi

కోరిన వారికి కొంగు బంగారమైన వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మ మహాజాతరకు మరో అడుగు పడింది. గత బుధవారం గుడి మెలిగెతో జాతర ఘట్టం ప్రారంభంకాగా, తాజాగా మండ మెలిగెతో ఉత్సవాలు ఊపందుకున్నాయి. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాల్లో బుధవారం వడ్డెలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కొండాయిలో గోవిందరాజులు, పూనుగొండ్లలో పగిడిద్దరాజు గుడుల్లో కూడా సంప్రదాయబద్ధంగా మండ మెలిగెను నిర్వహించారు. దుష్టశక్తులు రాకుండా గ్రామ పొలిమేరల్లో నీళ్లు ఆరబోశారు. మేడారానికి రక్షాబంధం కట్టారు.


సమ్మక్క– సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని మండమెలిగె పండుగను బుధవారం మేడారంలో ఘనంగా నిర్వహించారు. ఈ పండుగతో జాతర వేడుకలు ఊపందుకున్నాయి. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క గుడి, కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయం, ఏటూరునాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువున్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయం, మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లలోని సమ్మక్క భర్త పగిడిద్దరాజు ఆలయాలను వడ్డెలు శుద్ధిచేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు.      – ఎస్‌ఎస్‌తాడ్వాయి

మామిడాకు తోరణాలు..
సమ్మక్క పూజారి సిద్ధబోయిన లక్ష్మణ్‌రావు ఇంటి వద్ద నుంచి మామిడి తోరణాలు తీసుకువచ్చారు. తూర్పు, పడమర వైపు ఉన్న ప్రధానదారుల్లో  కొత్త బురుక కర్రలను తీసుకొచ్చారు. సంప్రదాయబద్ధంగా ఐదుగురు పూజారులు గడ్డపారను పట్టుకుని రోడ్డుకు ఇరువైపులా గుంతలు తవ్వారు. దిష్టి తగులకుండా మామిడి తోరణ ం, కోడిపిల్ల, సోరకాయ కట్టి ధ్వజ స్తంభాలు నిలిపారు. బుధవారం రాత్రి సమ్మక్క గుడి పూజారి కొక్కెర కృష్ణయ్య కంకణాలు, పసుపు, కుంకుమ రూపంలో అమ్మవారిని  గద్దె మీదకు తీసుకెళ్లారు. కంకణాలు కట్టి పూజలు చేశారు. 

కన్నెపల్లి సారలమ్మ గుడిలో..
కన్నెపల్లిలోని సారలమ్మ గుడిలో కాక వంశస్తులు మండమెలిగె నిర్వహించారు. సారలమ్మ ప్రధాన పూజారి కాక సారయ్య ఉదయం అమ్మవారి గుడిని శుభ్రపరిచారు. మహిళలు ఆలయాన్ని అలికి ముగ్గులతో అలంకరించారు. అమ్మవారి పూజ సామగ్రి, వస్త్రాలను శుద్ధి చేశారు. సాయంత్రం వడ్డె కాక సారయ్య సారలమ్మకు పూజలు నిర్వహించారు. రాత్రి మేడారంలోని దేవతల గద్దెల వద్దకు సాకహనం(సారా)ను తీసుకుని వెళ్లారు.

కొండాయి గోవిందరాజులు గుడిలో..

ఏటూరునాగారం మండలంలోని కొండాయి గ్రామంలో కొలువై ఉన్న సమ్మక్క మరిది గోవిందరాజులు ఆలయంలో మండ మెలిగె పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌ ఆధ్వర్యంలో గుడిని శుద్ధి చేశారు. పసుపు, కుంకుమతో ఆలయాన్ని అలంకరించారు. కొబ్బరి, బెల్లంతో గోవిందరాజులుకు నైవేద్యం సమర్పించారు. ఆలయం పక్కనే ఉన్న నాగులమ్మ ఆలయాన్ని పుట్టమన్నుతో అలికారు. ముగ్గులు వేసి పుసుపు, కుంకుమ చల్లి పూజలు నిర్వహించారు. 

సమ్మక్క ఆలయంలో.. 

సిద్ధబోయిన వంశస్తులు మేడారంలోని సమ్మక్క ఆలయంలో మండమెలిగె పండుగ జరిపారు. సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, నాగేశ్వర్‌రావు సమ్మక్క ఆలయానికి చేరుకున్నారు. కృష్ణయ్య అమ్మవారి శక్తిపీఠం, గద్దెలను పవిత్రమైన పుట్టమట్టితో అలికారు. నాగేశ్వర్‌రావు అమ్మవారి ధూపాదీపాలను కడిగి, మండ మెలిగె పూజలు నిర్వహించారు. అనంతరం సమ్మక్క ప్రధాన పూజారి సిద్ధబోయిన మునీందర్‌ ఇంటి నుంచి ఆచార ప్రకారం ఆడపడుచులు పసుపు, కుంకుమ, కంకణాలు, పవిత్ర జలాన్ని తీసుకుని డోలువాయిద్యాలతో సమ్మక్క గుడికి తీసుకెళ్లారు. అమ్మవారి గద్దెపై పసుపు, కుంకుమలు వేశారు. శక్తి పీఠాన్ని కూడా పసుపు, కుంకుమలతో అలంకరించారు. ముగ్గుల అలంకరణ పూర్తయిన అనంతరం పూజారులు ఆలయం నుంచి ధూపం, పసుపు, కుంకుమతో మైసమ్మ ఆలయం వద్దకు వెళ్లారు. అక్కడ మైసమ్మతోపాటు గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. జాతర ట్రస్టుబోర్డు కమిటీ చైర్మన్‌ కాక లింగయ్య, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు పాల్గొన్నారు.


ఘనంగా ఎదురుపిల్ల పండుగ

ములుగు రూరల్‌: మేడారం మహా జాతరకు వారం రోజుల ముందు గట్టమ్మ ఆలయం వద్ద ఎదురుపిల్ల పండుగను ఆదివాసీ నాయకపోడ్‌లు బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ములుగులోని నాయకపోడ్‌ కాలనీ నుంచి లక్ష్మీదేవరను సిద్ధం చేసి ఊరేగింపుగా బయలు దేరారు. దీంతోపాటు వాజేడు మండలం కడెకల్, ములుగు మండలం పత్తిపల్లి నుంచి వచ్చిన లక్ష్మీదేవరలను కలుపుకుని డీఎల్‌ఆర్‌ ఫంక్షన్‌హాల్‌ నుంచి గట్టమ్మ ఆలయం వరకు ర్యాలీగా బయలుదేరారు. మార్గమధ్యలో నాయకపోడ్‌ యువకుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అక్కడి నుంచి గట్టమ్మ వద్దకు చేరుకున్నారు. ఆలయ పూజారులు లక్ష్మీదేవరగను సాదరంగా ఆహ్వానించి ఎదురుకోళ్లు తీశారు. మహిళలు బోనాలతో అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. అమ్మవారికి యాటపోతులతో మొక్కులు చెల్లించారు. 

పగిడిద్దరాజుకు పానుపు తయారీ

గంగారం(ములుగు): మండ మెలిగెను పురస్కరించుకుని మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల గ్రామంలోని పగిడిద్దరాజు ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. సమ్మక్క భర్త అయిన పగిడిద్దరాజును పెన్క వంశీయులు భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. ముందుగా పానుపు(పగిడిద్ద రాజును పెళ్లి కుమారుడిని చేసేందుకు ఉపయోగించే పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలు, ధూపదీప నైవేద్యం)ను సిద్ధం చేసి తళపతి ఇంట్లోని ప్రత్యేక పూజ గదిలో ఉంచారు. తళపతి ఇంటి నుంచి పూజాసామగ్రిని పగిడిద్ద రాజు ఆలయానికి తీసుకొచ్చారు. గుడిని శుభ్రపరిచిన అనంతరం పెన్క వంశీయుల ఆడబిడ్డలు ఆలయం ఎదుట లఘ్నపు ముగ్గు వేశారు.  

30న మేడారానికి పయనం
పగిడిద్దరాజును ఈనెల  30న మేడారానికి తీసుకెళ్లాలని పూజారులు ముహూర్తాన్ని నిర్ణయించారు. పగిడిద్దరాజు పడిగెతో సహా పూజారులు, పెనక వంశీయులు కాలి నడకన మేడారం బయలుదేరుతారు. ఆరోజు రాత్రి లక్ష్మీపురంలోని పెనక వంశీయుల ఇంట్లో బస చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారుజామున పస్రా చేరుకుంటారు. పస్రా నుంచి పోలీసు బలగాలతో మేడారం చిలుకలగుట్టకు చేరుకుంటారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement