మంత్రికి చెమటలు పట్టించిన నయన(ఇన్‌సెట్)
సాక్షి, బెంగళూరు (చిత్రదుర్గ): ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాలపై ఓ విద్యార్థిని ఏకంగా మంత్రిని నిలదీసిన సంఘటన శుక్రవారం చిత్రదుర్గ పట్టణంలో చోటుచేసుకుంది. సదరు విద్యార్థిని సంధించిన ప్రశ్నలకు మంత్రికి చెమటలు పట్టాయి. వివరాలు... పట్టణంలోని బాలుర ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ప్రతిభా కారంజీ కార్యక్రమానికి సాంఘిక శాఖ మంత్రి ఆంజనేయ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి కూడా విద్యార్థులు వచ్చారు. ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న నయన మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలల్లో అసౌకర్యాల లేమిపై మంత్రి ఆంజనేయను నిలదీసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన అన్ని సదుపాయాలు, నాణ్యమైన విద్య అందిస్తే తాను ప్రైవేట్ పాఠశాల వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరుతానని, తనతో పాటు మరో 30 మంది స్నేహితులను కూడా వస్తారని మీరు సమకూర్చుస్తారా అంటూ ఆ విద్యార్థిని మంత్రి ఆంజనేయులకు ఓపెన్ చాలెంజ్ చేసింది. మీతోనే కాదు సీఎం సిద్దరామయ్యకు కూడా చాలెంజ్ చేస్తున్నా, సమావేశాల్లో గొప్పలు చెప్పడం కాదు, చేసి చూపించండి అంటూ మంత్రిని సదరు విద్యార్థిని నిలదీసింది. దీంతో అక్కడున్న వారు నయన వాగ్ధాటికి కంగుతిన్నారు. మంత్రి కూడా మిన్నకుండి పోయినట్లు సమాచారం. అనంతరం నయనను ప్రతి ఒక్కరు అభినందించారు.