భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కసరత్తు తుదిదశకు చేరుకుంది. శ్రీరాముడు జన్మించిన విళంబినామ సంవత్సరం వచ్చే మార్చిలో నిర్వహించే శ్రీరామనవమికి ఎంతో ప్రత్యేకత ఉన్న దృష్ట్యా అదే రోజున భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి శంకుస్థాపన చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. చినజీయర్ సూచనలతో దేవాదాయశాఖ రూపశిల్పి ఆనందసాయి నేతృత్వంలో ఇప్పటికే మూడు నమూనాలను సిద్ధం చేశారు. ఆ నమూనాలను త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుకు తీసుకెళ్లనున్నారు. సీఎం ఆమోదంతో వచ్చే నెలలో పనులు ప్రారంభించే అవకాశం ఉండడంతో ఆలయ అధికారులు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు.
65 ఎకరాల్లో ఆలయాభివృద్ధి
భద్రాచలం ఆలయాభివృద్ధికి 65 ఎకరాల భూమి అవసరం ఉంటుందని జిల్లా అధికారులు ప్రాథమికంగా నివేదించారు. రామాలయం చుట్టూ 28 ఎకరాలు, అదే విధంగా కల్యాణ మండపం, దీనికి ఆనుకుని ఉన్న ఖాళీ స్థలాలు ఇలా మిగతా 37 ఎకరాలను రెండు చోట్ల సేకరించేలా నివేదికలో చూపించారు. రామదాసు కాలంలో నిర్మించిన గర్భగుడిని అలాగే ఉంచి, చుట్టూ రెండు ప్రాకారాలను శిల్పికళా శోభితంగా నిర్మించాలని డిజైన్‌లో పేర్కొన్నారు.
నిత్య కల్యాణ మండపం, స్వామి వారి తిరువీధి సేవ కోసం మాడవీధులతో పాటు, భక్తులు ఆలయం చుట్టూ తిరిగేలా మరో దారిని కూడా ఏర్పాటు చేయాలని, ఆలయం నలువైపుల నుంచి స్వామి వారి దర్శనం చేసుకునేలా ద్వారాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు.
వేయికాళ్ల మండపం
వేయికాళ్ల (శిల్పాలతో చెక్కిన వేయి ఫిల్లర్‌లు కలిగిన)మండప నిర్మాణానికి డిజైన్‌లో ప్రాధాన్యం కల్పించారు. శ్రీరామనవమి నాడు శ్రీసీతారాముల వారికి పెళ్లి వేడుక జరిగే కల్యాణ మండపం, దీనికి ఆనుకొని ఉన్న స్థలంలో వేయి కాళ్ల మండపాన్ని నిర్మించాలని నిర్ణయించారు. వేయికాళ్ల మండపం అంతర్భాగంలోనే కల్యాణ మండపం కూడా ఉండేలా డిజైన్ తీర్చిదిద్దారు. ప్రస్తుతం అందుబాటులో కల్యాణ మండపంలో మొత్తంగా 35 వేల మంది శ్రీరామనవమి రోజున స్వామి వారి పెళ్లి వేడుకను ప్రత్యక్ష్యంగా తిలకిస్తున్నారు. భవిష్యత్‌లో 80 వేల మంది మండపంలో కూర్చొనేవిధంగా డిజైన్ తయారు చేశారు.
108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం
గోదావరి తీరంలో 108 అడుగుల ఎత్తైన అభయాంజనేయస్వామి వారి విగ్రహాన్ని నిర్మించేలా డిజైన్‌లో పొందుపరిచారు. రామాలయం నుంచి నేరుగా గోదావరి తీరం వరకూ నేరుగా వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.
నిర్వాసితులకు పునరావాసం ఎక్కడ?
ఆలయాభివృద్ధిలో భాగంగా రామాలయం చుట్టూ ఉన్న వందకు పైగా ఇళ్లను కూల్చివేయాల్సి వస్తోంది. ఈ లెక్కన రామాలయం వెనుక ఉన్న జీయర్ మఠం నుంచి గోదావరి కరకట్ట వరకూ చుట్టు పక్కల ఇళ్లవారిని వేరే చోటకు తరలించాల్సి ఉంటుంది. భద్రాచలంలో ప్రభుత్వ స్థలం లేకపోవటంతో వీరికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి ఆనుకొని ఉన్న పురుషోత్తపట్నంలో ఆలయానికి సంబంధించిన వెయ్యి ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఇవి రాష్ట్ర విభజనతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వెళ్లిపోయాయి. దీంతో వీరికి అక్కడ పునరావాసం కల్పించటం వల్ల వారిని వేరే రాష్ట్రంలోకి పంపించినట్లౌతుంది. ఇది పెద్ద సమస్యగా మారనుంది. ఈ ప్రాంత వాసుల డిమాండ్ మేరకు భద్రాచలానికి సమీపంలో ఉన్న ఐదు పంచాయతీలు తిరిగి తెలంగాణకు వస్తేనే ఇటువంటి సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేసే క్రమంలోనే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడిని శ్రీరామ నవమికి ఆహ్వానించేలా ఆలోచన చేస్తుందనే ప్రచారం ఉంది.
అంతా సిద్ధం చేశాం
ఆలయాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే శ్రీరామనవమికి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఆ దిశగానే దేవాదాయశాఖ ఉన్నతాధికారుల అనుమతితో ఏర్పాట్లు చేస్తున్నాం. మరోవైపు శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా ఏర్పాట్లు చేస్తున్నాం.
ప్రభాకర శ్రీనివాస్, దేవస్థానం ఈఓ
Comments
Please login to add a commentAdd a comment