
చోరీ తీరును పరిశీలిస్తున్న ఏసీపీ రామోజీ రమేష్ (ఫైల్)
సాక్షి, కూసుమంచి: మండల కేంద్రమైన కూసుమంచిలో దొంగలు అలజడి సృష్టిస్తున్నారు. తాళ్లాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతున్నారు. వారం వ్యవధిలోనే రెండు దొంగతనాలు జరగటంతో ప్రజలు హడలిపోతున్నారు. ఈఘటనలు పోలీసులకు కూడా సవాల్‌గా మారడంతో వారు దొంగలను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఫిబ్రవరి 26వ తేదీ రాత్రి గ్రామానికి చెందిన ఓ పత్రికా విలేకరి, పురుగుమందుల వ్యాపారి ఎండీ రంజాన్ ఆలీ ఇంట్లో దొంగలు పడి 18 తులాల బంగారం, లక్ష రూపాయల నగదును, ఎల్‌ఈడీ టీవీ ఎత్తుకెళ్లారు. కొద్ది రోజుల వ్యవథిలోనే మార్చి 8న గ్రామానికి చెందిన అర్వపల్లి మౌలాలీ ఇంట్లో దొంగలు పడి 5తులాల బంగారు ఆభరణాలు, 60వేల రూపాయకల నగదును ఎత్తుకెళ్లారు. ఈ రెండు గృహాలు జనం రద్దీగా ఉండే ప్రాంతాలే.
అయినప్పటికీ దొంగలు చాకచక్యంగా చోరీలకు పాల్పడటంతో గృహాల వారికి కునుకు పట్టడం లేదు. ఈ ఘటనలతో బాధితులతో పాటు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దొంగల బెడదను అరికట్టాలని పోలీసుశాఖకు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే వేసవికాలం చోరీలు ఎక్కువగా జరిగే సీజన్. ఇప్పటికే చోరీలు ప్రారంభం కావటంతో పోలీసులు నిఘాను పెంచారు.