మంత్రి అఖిలకు ‘నూతన’ షాక్‌! | Minister Akila Priya Vs A V Subba Reddy in New Year Celebrations | Sakshi
Sakshi News home page

మంత్రి అఖిలకు ‘నూతన’ షాక్‌!

Published Mon, Jan 1 2018 1:11 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Minister Akila Priya Vs A V Subba Reddy in New Year Celebrations - Sakshi

ఆళ్లగడ్డ: నూతన ఏడాది..మంత్రి అఖిలప్రియకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆమె వెంట ఉన్న అనుచరులు, కార్యకర్తలు ఏవీ సుబ్బారెడ్డి వైపు తిరగడం తలనొప్పిగా మారింది. బంధువులు సైతం మంత్రి మాట వినకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఆదివారం..ఆళ్లగడ్డలో నిర్వహించిన నూతన సంవత్సర స్వాగత వేడుక ఇందుకు వేదికగా నిలిచింది. 

ఏం జరిగిందంటే.. 
నూతన ఏడాదికి స్వాగతం చెబుతూ ఆదివారం ఆళ్లగడ్డలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశామని..అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా హాజరు కావాలని అధికార పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డి పిలుపునిచ్చారు. ఈ విందుకు ఎవరూ వెళ్లవద్దని మంత్రి అఖిలప్రియ తన ప్రధాన అనుచరుడితో కార్యకర్తలకు, బంధువులకు ఫోన్‌ చేయించారు. అయితే మంత్రి ఆదేశాలను భేఖాతర్‌ చేస్తూ.. ఆదివారం రాత్రి ఆళ్లగడ్డలోని ఏవీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన విందుకు 10వేల మంది వరకు హాజరయ్యారు. దీంతో షాక్‌ తినడం మంత్రి అఖిలప్రియ వంతైంది. మంత్రి ప్రధాన అనుచరులను సైతం విస్మయానికి గురి చేసింది. 

మంత్రి సొంత బంధువులైన ఎస్వీనాగిరెడ్డి, ఎస్వీ ప్రసాదరెడ్డి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావడం చర్చనీయాంశమైంది. ఏవీ సుబ్బారెడ్డి ఫంక్షన్‌ను అడ్డుకోవాలని మంత్రి అఖిల ప్రియన చేసిన ప్రయత్నాలు ఏమీ ఫలించలేదు. ‘‘ కొత్తగా పింఛన్లు మంజూరయ్యాయి, మీ గ్రామాల్లో అభివృద్ధి పనులు మంజూరు చేస్తాను..  విందుకు వెళ్లవద్దు’’ అని చెప్పినా ఎవరూ వినలేదు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, గ్రామాల్లోని టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున  విందుకు హాజరు కావడం చర్చనీయాంశమైంది. భూమాను నమ్ముకున్న వారికి అండగా ఉండేందుకు ఆళ్లగడ్డలోనే ఉంటానని ఈ సందర్భంగా ఏవీ చెప్పారు. 

ఆరా తీసిన మంత్రి... 
ఏవీ ఏర్పాటు చేసిన విందుకు ఎవరెవరు హాజరయ్యారు.. వారి పేర్లతో సహా తనకు కావాలని మంత్రి తన అనుచరులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో మంత్రి అనుచరులు విందు కార్యక్రమానికి హాజరై గ్రామాల పేర్లతో పాటు వాటి నాయకుల పేర్లు.. ఏ గ్రామం నుంచి ఎంత మంది వచ్చారు వంటి వివరాలు సేకరించి ఎప్పటికప్పుడు చేరవేశారు. తాను చెప్పినా వినకుండా వచ్చిన నాయకులపై ఇప్పటి నుంచి కఠినంగా వ్యవహరిస్తానని మంత్రి చెప్పిట్లు సమాచారం.  

ఆళ్లగడ్డలో పాగాకు ‘ఏవీ’ యత్నాలు 
దివంగత భూమానాగిరెడ్డి, ఏవీ సుబ్బారెడ్డిల స్నేహం బలమైంది. వీరిద్దరూ ప్రాణ స్నేహితులుగా మెలిగారు. అయితే భూమా మరణించిన తర్వాత భూమా కుమార్తె మంత్రి అఖిలప్రియ, టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డిల మ«ధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. మంత్రి ఏవీ సుబ్బారెడ్డిని ఖాతరు చేయకపోవడంతో ఆళ్లగడ్డలో ఆయన తిష్టవేశారు. తన బలాన్ని అధికార పార్టీ నేతల దృష్టికి తీసుకొని వెళ్లి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆళ్లగడ్డ నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. ఏదేమైనా మంత్రి అఖిల, ఏవీ సుబ్బారెడ్డిల మధ్య ఉన్న విభేదాలు ఈ విందు కార్యక్రమంతో మరోసారి బట్టబయలయ్యాయి.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement