జనసేన గమ్యం ఎటు
►అభివృద్ధికి ఈ ఏడాదైనా బాటలు పడేనా
►ప్రచారమేనా.. పనులు చేస్తారా
►అయోమయంలో టీడీపీ శ్రేణులు
►ఉద్యమ పథంలో వైఎస్సార్ సీపీ
►పొత్తు కత్తుల నుంచి కమలం బయటపడుతుందా
►జనసేన గమ్యం ఏమిటో
సాక్షి ప్రతినిధి, ఏలూరు : కొత్త సంవత్సరం కోటి ఆశలతో మొదలైంది. ఈ ఏడాదైనా జిల్లాలో అభివృద్ధి బాటలు పడతాయా. గడచిన రెండున్నరేళ్లలాగే హామీలతో కాలం గడిపేస్తారా.. పోలవరం ప్రాజెక్ట్ భజనతో సరిపెడతారా అనే విషయాలు త్వరలోనే తేలిపోనున్నాయి. ప్రజాప్రతినిధులు ప్రజాభీష్టానికి విలువ ఇస్తారా లేక పాత పంథాలోనే సాగిపోతారా అన్నది చూడాల్సి ఉంది. సహజ వనరులు, మౌలిక సదుపాయాలన్నీ ఉన్నా పారిశ్రామికంగా వెనకబాటుతనం ఇంకా పోలేదు. కొత్తగా ఒక్క పరిశ్రమ కూడా రావడం లేదు. పరిశ్రమల కోసం భూమిని సేకరించే ప్రక్రియ ఇంకా నత్తతో పోటీ పడుతోంది. అటవీ శాఖ భూముల డీ–నోటిఫికేషన్ ప్రక్రియకు కేంద్రం నుంచి ఇంకా ఆమోదం రాలేదు.
ప్రచారమేనా.. పనులు చేస్తారా!
టీడీపీ అధికార పగ్గాలు చేపట్టి రెండున్నరేళ్లు దాటినా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ హామీలు అమలు కాలేదు. పెద్ద నోట్ల రద్దుతో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రయత్నాలను రాష్ట్ర ప్రభుత్వం మొదలు పెట్టలేదు. రైతులకు రుణాలు అందక.. బ్యాంకు ఖాతాల్లో మూలుగుతున్న సొమ్ము తీసుకునే అవకావం లేక రబీ సాగు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఇప్పటికే వందలాది ఎకరాల్లో పంట విరామం ప్రకటించారు. మొన్నటి వరకూ పట్టిసీమను పట్టుకుని వేలాడిన ప్రభుత్వం ఇప్పుడు పోలవరం భజన చేస్తోంది. వచ్చిన నిధులు గత అప్పులకే సరిపోయే పరిస్థితి. ఈ ఏడాది పనులను వేగవంతం చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎంతవరకూ ముందుకు సాగుతాయో వేచి చూడాల్సిందే. నిర్వాసితుల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వారిని అవస్థలకు గురి చేస్తోంది. చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ విషయంలో రైతులు ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ప్రజలంతా వ్యతిరేకిస్తున్నా గోదావరి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌కు మద్దతు ఇచ్చిన భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలకు గత ఏడాది చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఇప్పటికైనా వారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోకపోతే తీవ్ర నిరసనలు ఎదుర్కోక తప్పని పరిస్థితి కనపడుతోంది. ఈ ఏడాది అధికార పక్షానికి గడ్డుకాలంగా మారుతుందా లేక ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకుంటుందా అనేది వేచి చూడాల్సిందే.
ఉద్యమ పథంలో వైఎస్సార్ సీపీ
ఏడాది కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా శ్రేణులు ఉద్యమాలతో ఉత్తేజాన్ని పొందాయి. ప్రత్యేక హోదాపై ఎడతెగని పోరాటాలు, పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఏలూరులో మోగించిన యువభేరి, తుందుర్రు ఆక్వాపార్క్ బాధితులకు సంఘీభావంగా చేసిన పర్యటన, ముంపు మండలాల ప్రజలకు మద్దతుగా నిలబడిన తీరు పార్టీ ప్రతిష్టను ఇనుమడింప చేశాయి. చంద్రబాబు నాయుడి వాగ్దాన భంగాలపై వంద ప్రశ్నలను గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం ద్వారా ప్రజల ముంగిటకు తీసుకువెళ్లడంలో నియోజకవర్గ సమన్వయకర్తలు సఫలీకృతం అయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో పార్టీ జిల్లా సారథిగా బాధ్యతలు చేపట్టిన ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) పార్టీ సంస్థాగత బలోపేతమే లక్ష్యంగా జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాల్లో పర్యటనలు జరుపుతున్నారు. మెగా అక్వాఫుడ్ పార్క్, ఆరోగ్యశ్రీ అమలు కోసం ధర్నాలు, ఉద్యమాలు కొనసాగుతున్నాయి. వీటికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడింది. ఈ ఏడాది కాలంలో కెరటంలా ఎగసిన వైఎస్సార్ సీపీ 2017లో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించేందుకు సమరోత్సాహంతో దూసుకువెళ్తోంది.
పేద ప్రజలకు అండగా....
వామపక్షాలు ముఖ్యంగా సీపీఎం గడచిన ఏడాది కాలంలో ఉద్యమాలతో ముందుకు వెళ్లింది. మెగా అక్వాఫుడ్ పార్క్‌తోపాటు కాలుష్యానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున ఆ పార్టీ శ్రేణులు ఉద్యమించాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.బలరాం నేతృత్వంలో పాదయాత్రలతో ప్రజలకు అండగా నిలబడ్డారు. రాబోయే కొత్త సంవత్సరాన్ని ప్రభుత్వంపై పోరాటాల సంవత్సరంగా అభివర్ణిస్తున్నారు.
కమలనాథులు పరిస్థితి ఏమిటో
మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో బీజేపీ విభేదాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది రైతు మహాసభ పేరుతో పార్టీ అధినేత అమిత్‌షాను తీసుకువచ్చి కమలనాథులు బలప్రదర్శన చేశారు. ఆ సభను అడ్డుకోవడానికి టీడీపీ నాయకులు చేసిన ప్రయత్నాలతో రెండుపక్షాల మధ్య వైరం మరింత పెరిగింది. తాజాగా పోలవరంలో స్పిల్‌వే కాంక్రీట్ పనుల శంకుస్థాపనకు పార్టీ నేతలకు కనీస ఆహ్వానం కూడా రాకపోవడం విభేదాలకు మరింత ఆజ్యం పోసింది. పెద్ద నోట్ల రద్దుతో పార్టీ ప్రతిష్ట దిగజారగా, పుండుమీద కారం చల్లినట్టు టీడీపీ నేతలు చేసిన విమర్శలపై బీజేపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు.
జనసేన గమ్యం ఎటు
ప్రశ్నించడానికి పుట్టిన జనసేన పార్టీ గమ్యంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తుందుర్రు మెగా అక్వాఫుడ్ పార్క్ బాధితుల తరఫున జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మాట్లాడటం, తర్వాత ఆ పార్టీ బృందం పర్యటించి వెళ్లడం మినహా ఇప్పటివరకూ జిల్లాపై ప్రత్యేకమైన ముద్ర వేసిందేమీ లేదు. ఏలూరు ప్రాంతానికి చెందిన జనసేన శ్రేణులు కలిసినపుడు ఏలూరులో ఓటు నమోదు చేసుకుంటానని, ఇల్లు చూడాలని పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో ఆయన అభిమానులు అనేక ఇళ్లను చూసినా.. పవన్ నుంచి స్పందన రాలేదు. పవన్ ఏలూరు మకాం మారుస్తారా? ఇక్కడే ఉండి రాజకీయం చేస్తారా? లేకపోతే ప్రకటనకే పరిమితం అవుతారా అన్నది ఈ ఏడాది తేలిపోనుంది.