చెట్టును ఢీకొన్న తుఫాన్ వాహనం
సాక్షి,శిరివెళ్ల: నిద్రమత్తు ఇద్దరి ప్రాణాలు బలిగొంది. మరో ఎనిమిది మందిని క్షతగాత్రులను చేసింది. పుణ్యక్షేత్రాలు చూడాలని బయలుదేరిన వీరి ఆశ తీరకుండానే ప్రమాదానికి గురిచేసింది. సోమవారం నల్లమలలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాద వివరాలు ఎస్‌ఐ తిమ్మారెడ్డి తెలిపిన మేరకు ఇలా ఉన్నాయి.
గుంటూరు జిల్లా దాచేపల్లె మండలం పెద్దగార్ల గ్రామానికి చెందిన రైతులు పది మంది పుణ్యక్షేత్రాలు చూసేందుకని తుఫాన్ వాహనంలో ఆదివారం అర్ధరాత్రి బయలు దేరారు. ఉదయానికంతా మహానందికి చేరుకోవాలనేది వారి ప్రణాళిక. అందులో భాగంగా తుఫాన్ వేగంగా ముందుకెళ్తోంది. ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. సమయం తెల్లవారుజామున 5.30 గంటలయింది. నల్లమల అటవీ ప్రాంతంలోని పచ్చర్ల సమీపంలోకి రాగానే డ్రైవర్‌కు కూడా నిద్ర ఆవహించింది. వాహనం ఒక్కసారిగా రోడ్డు పక్కనున్న చెట్టును బలంగా ఢీకొంది. ఏం జరిగిందోనని తెలుసుకునేలోపు ఇద్దరు విగత జీవిలయ్యారు.
మిగతా వారంతా రక్తగాయాలతో పెడబొబ్బలు పెట్టారు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మడిశన్ బ్రహ్మయ్య (45) గరికెల అంజి (48) మృతదేహాలను పోస్ట్‌మార్టంకు తరలించి, గాయాలపాలైన కల్యాణ్(డ్రైవర్), హనుమంతరావు, నారాయణ, గోవిందమ్మ, రాజారమణి, నాగేశ్వరావు, శ్రీనివాసరావు, భూలక్ష్మీలను చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తే కారణమని ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు ఎస్‌ఐ తెలిపారు. క్షత్రగాత్రుడు హనుమంతరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment