పిండి వంటలు తయారు చేస్తున్న మహిళలు
ఒకప్పుడు వారి వృత్తి వ్యవసాయం..పొలంలో పనిచేస్తేగాని కుటుంబాలు గడిచేవి కావు. ఎంత కష్టపడినా మిగులు బాటు ఉండేది కాదు. ప్రకృతి వైపరీత్యాలో..చీడపీడలో.. మార్కెట్లో పతనమైన ధరలో.. వారి ఆశలపై నీళ్లు చల్లేవి. ఇంటి అవసరాల కోసం..పిల్లల చదువుల కోసం మళ్లీ రెక్కల కష్టాన్ని నమ్ముకోవాల్సి వచ్చేది. అయితే ఓ ఆలోచన వారి జీవితంతో మార్పు తెచ్చింది. వంటల్లో, అల్లికల్లో వారి అభి‘రుచి’ ఉపాధికి దారి చూపింది. వారు సాధించిన విజయం నారీమణులకు స్ఫూర్తిగా నిలిచింది.
కర్నూలు, ఆళ్లగడ్డ: శాంతి నగరం.. బత్తలూరు పంచాయతీలోని ఓ గ్రామం. ఈ ఊరిలో ఇంటికో ఉద్యోగి ఉన్నారు. సీఏ, బీటెక్, ఎంటెక్ వంటి ఉన్నత చదువులు చదివి.. పలువురు విదేశాల్లో కొలువులు చేస్తున్నారు. ఈ పల్లెకు మరో ప్రత్యేకత ఉంది. అది.. మహిళా శక్తి. ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఆసక్తి. అదే వారిని ముందుకు నడిపించింది. శ్రీ సీత గ్రామైక్య సంఘం ఏర్పాటుకు దారితీసింది.
ఏం చేశారంటే..
ఒక్కరితో ఏ పనీ సాధ్యం కాదు. అందరూ కలవాలి..ఆలోచనలు పంచుకోవాలి.. సాధ్యాసాధ్యాలను పరిశీలించుకోవాలి..ఓ ప్రణాళిక కూడా అవసరమే.. శాంతినగరం మహిళలు ఈ ఆంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి..ముప్ఫై మంది మహిళలు ఏకమయ్యారు. తమకు తెలిసిన వంటలు, జ్యూట్ బ్యాగులు, అలంకరణ వస్తువుల తయారీని మార్కెటింగ్ చేయాలనుకున్నారు. వంట తయారీకి గ్రామంలోని ఓ ఇంటిని ఏర్పాటు చేసుకున్నారు. బొప్పట్లు, తీపిగవ్వలు, గారెలు(అత్తరాసెలు), కారాలు తది తర వాటిని స్వయంగా చేసి 250 గ్రాముల ప్యాక్‌తో సిద్ధం చేసి అమ్మేవారు. వివాహాది శుభకార్యాలకు క్యాటరింగ్ చేసేవారు. వంటలు రుచిగా ఉండడం, ధర తక్కువగా ఉండడంతో మంచి పేరు వచ్చింది. వ్యాపారం బాగా జరగడంతో లాభాలు వచ్చాయి. అందుకే వారు తాము తయారు చేసే వంటలకు శ్రీ లక్ష్మీ స్వగృహ ఫుడ్స్ అని నామకరణం చేశారు.
గృహోపకరణాలు తయారీ.. ఇంటి అలకంకరణ వస్తువులు, పూసల బ్యాగులు, పెన్‌స్టాండ్లు తదితర వాటిని జ్యూట్‌తో తయారీ చేస్తుంటారు. మార్కెట్లో లభించే వివిధ రకాల రంగులను తెచ్చుకుని నచ్చిన రంగులో జ్యూట్‌ను తయారు చేసుకుంటారు. చుడ్డానికి ఎంతో ఆకర్షించే ఆ వస్తువులు బహుమతులు ఇవ్వడానికి, గృహాల అలంకరణలకు ఉపయోగపడతాయి. ముడిసరకు వీరు బెంగళూరు, హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటారు.
సొంత నిధులతోనే..
ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో సొంతనిధులతో వారు.. పిండివంటలకు కావాల్సిన సరుకులను పెద్దమొత్తంలో ఒకేసారి తెచ్చుకుంటున్నారు. ఇంట్లో పనుల అనంతరం తీరికవేళల్లో వం టలు, గృహోపకరణాలు తయారు చేస్తుంటారు. ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, సూపర్ మార్కెట్‌లకు తీసుకెళ్లి అమ్ముతారు. ఎవరైనా అర్డర్ ఇస్తే తీసుకెళ్లి ఇస్తారు. వచ్చిన మొత్తాన్ని సమభాగాలుగా పంచుకుంటారు. మూడేళ్లుగా ఒక్కో మహిళకు రూ.10 వేల వరకు నెల ఆదాయం వస్తున్నట్లు వారు చెబుతున్నారు. వచ్చిన డబ్బుతో పిల్లలను ఉన్నత చదువులు చదివిస్తున్నామన్నారు.
అధికారుల ప్రశంస
ఇటీవల కర్నూలులో జరిగిన గణంత్ర వేడుకల్లో శాంతినగరం మహిళలు స్టాల్ ఏర్పాటు చేశారు. స్టాల్‌లో ఉన్న ఫుడ్స్, గృహోపకరణాలను చూసి జిల్లా కలెక్టరు సత్యనారాయణ, ఎస్పీ గోపీనాథ్‌జట్టి ప్రశంసించారు.
ఆదరణ పెరుగుతోంది
మా స్వగృహ ఫుడ్స్‌కు ఇప్పుడిప్పుడే ఆదరణ పెరుగుతుంది. నేను మార్కెటింగ్ చేస్తుంటాను. చాలా మంది ఆర్డర్లు ఇస్తున్నారు. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం లేదు. మాకు మేమే ఉపాధిని ఏర్పాటు చేసుకున్నాం. – రమాదేవి, శాంతినగరం
ఐక్యతే విజయం వైపు దారి చూపుతోంది
టీంలోని మహిళలందూ ఐక్యంగా ఉండటంతో విజయం వైపు అడుగులు వేస్తున్నాం. సక్సెస్ అవుతామా లేదా అనే భయం మొదట ఎక్కువగా ఉండేది. తోటి మహిళల ప్రోత్సాహకం బాగుంది. మా స్వగృహ ఫుడ్స్‌ను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నాం. –విజయలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment