
సాక్షి, దేవరకద్ర : మహబూబ్‌నగర్ కలెక్టర్ రొనాల్డ్ రోస్ జిల్లా కేంద్రం నుంచి దేవరకద్రలోని కందుల కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు నిన్న (గురువారం) ఉదయం బయలుదేరారు. మార్గమధ్యలో కోయిల్‌కొండ పోతన్‌పల్లి వద్ద వద్ద కొందరు పిల్లలు మేకలను కాస్తూ కనిపించారు. ఇది చూసిన ఆయన వాహనం ఆపి వారితో మాట్లాడారు. చదువుకోవాల్సిన వయస్సులో ఈ పని ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. తన వాహనంలో ఎక్కించుకుని దేవరకద్ర ఉర్దూ మీడియం పాఠశాలకు తీసుకొచ్చారు.
ఆ పిల్లల్లో ఒకరు ఖాజా కాగా, మరొకరు మౌలానా. వారి తండ్రి చనిపోవడంతో 3వ తరగతి, 9వ తరగతి చదువుతూ మానేశారని ఉపాధ్యాయులు తెలిపారు. వారిద్దరిని పాఠశాలలో చేర్పించి సక్రమంగా వచ్చేలా చూడాలని, డ్రాపౌట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. కాగా, విద్యార్థులపై కలెక్టర్ చూపిన ప్రత్యేక శ్రద్ధపై పలువురు అభినందించారు.