చిగురిస్తున్న ఆశలు..! | Thandas turning into gram panchayats | Sakshi
Sakshi News home page

చిగురిస్తున్న ఆశలు..!

Published Fri, Jan 26 2018 3:32 PM | Last Updated on Mon, Oct 8 2018 5:07 PM

Thandas turning into gram panchayats - Sakshi

గ్రామపంచాయతీగా ఏర్పాటుకానున్న మోత్కులకుంట తండా

రాజాపూర్‌ : సరైన రోడ్లు, విద్యుత్, నీటి వసతి లేక అభివృద్ధికి ఆమడదూరంలో ఇన్నాళ్లు గిరిజన తండాలు ఉండేవి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం 500 జనాభా ఉన్న ప్రతి గిరిజన తండాను గ్రామపంచాయతీగా ప్రకటించి అభివృద్ధి చేస్తామని ఎన్నికల హామీలో పేర్కొన్న విషయం విధితమే. ఈమేరకు తండాలను గ్రామపంచాయతీలుగా ప్రకటించేందుకు ఇటీవల నివేదికలు సిద్ధం చేస్తుండడం.. మండల అధికారుల నుంచి సమాచారం తీసుకుంటుండడంతో గిరిజనుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. తమ కష్టాలు ఇక తీరనున్నాయని.. అన్ని వసతులు కల్పనతోపాటు తండాలు అభివృద్ధి చెందనున్నాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.   
8 తండాలకు జీపీలుగా అవకాశం 
నూతనంగా ఏర్పాటైనన రాజాపూర్‌ మండలంలో మొత్తం 14 గ్రామ పంచాయతీలు ఉండగా మరో 8 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మండలంలో ఇప్పటికే కుత్నపల్లె, రాఘవాపూర్, నర్సింగ్‌తండా, సింగమ్మగడ్డతండా, మోత్కులకుంటతండా, పల్గుతండా, బీబీనగర్‌తండా, నాన్‌చెరువుతండాలను గ్రామపంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు అధికారులు నివేదికలు తయారు చేశారు. అయితే 8 గ్రామ పంచాయతీలుగా ఏర్పాటుచేస్తే మండలంలో మొత్తం 22 గ్రామ పంచాయతీలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. దీంతో తండాలకు ప్రత్యేక నిధులు వస్తే తండాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతాయని గిరిజనులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో గ్రామాలకు తండాలు అనుబంధంగా ఉండటంతో తండాలను పట్టించుకునేవారు కాదని మా తాండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అయితే అభివృద్దికి వీలు ఉంటుందని గిరిజనులు అంటున్నారు.

అభివృద్ధి చెందుతాయి
మా తండాలు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు అవుతున్నందున సంతోషంగా ఉంది. గతంలో తండాలను అసలు పట్టించుకునే వారు కాదు. ప్రస్తుతం ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటవుతున్నందున ప్రభుత్వం నిధులు మంజూరు చేయనుంది. పాఠశాలలు ఏర్పాటుచేయడంతోపాటు, నీరు, విద్యుత్, రోడ్డు సౌకర్యాలు మెరుగు పర్చనున్నారు.  
– గీత, మోత్కులకుంట తండా 

హామీ నెరవేరుస్తున్నాం.. 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు తండాలను గ్రామ పంచాయతీలుగా ప్రకటించనుంది. దీంతో ప్రత్యేక నిధులు కేటాయించి తండాల్లో సమస్యలు పరిష్కరించనుంది. రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లక్ష్యంగా పని చేస్తున్నారు.  8 తండాలు గ్రామపంచాయతీలుగా మారనున్నాయి.

 – ప్రభాకర్‌రెడ్డి, జెడ్పీటీసీ  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement