సాక్షి, ముంబై : గత రెండేళ్లుగా పెండింగులో పడిపోయిన హాంకాక్ బ్రిడిన్జి నిర్మించేందుకు ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఇటీవల అధికారులు టెండర్ల ప్రక్రియ పూర్తిచేశారు. ఇందులో సాయి ప్రాజెక్ట్స్ అనే సంస్థ కాంట్రాక్టు దక్కించుకుంది. దీంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. కాగా ఈ వంతెన నిర్మాణానికి, సలహాదారుల కమిటీ సహా మొత్తం రూ.51 కోట్లు ఖర్చు కానున్నాయి.
130 ఏళ్ల నాటి బ్రిడ్జి..
సెంట్రల్ రైల్వే మార్గంపై శాండ్రస్ట్ రోడ్ స్టేషన్ సమీపంలో ఉన్న హాంకాక్ బ్రిడ్జి 130 ఏళ్ల నాటిది కావడంతో శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అది ఎప్పుడైనా కూలే ప్రమాదముందని గుర్తించిన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా 2016 మార్చిలో దాన్ని నేలమట్టం చేశారు. అందుకు 48 గంటల ప్రత్యేక బ్లాక్ తీసుకున్నారు. ఆ తరువాత వాహనాలను ఇతర బ్రిడ్జిల మీదుగా మళ్లించారు. కానీ, ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఇటు రైల్వే గాని, అటు బీఎంసీ గాని ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడసాగారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి పట్టాలు దాటుతూ రాకపోకలు సాగించడం మొదలు పెట్టారు. ఇలా ఈ రెండేళ్ల కాలంలో రైలు ఢీ కొని ఇద్దరు మృతి చెందారు. ఇందులో ఓ విద్యార్థి ఉన్నాడు. అలాగే పలువురు గాయపడిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగ్రహానికి గురైన స్థానికులు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించాలని పలుమార్లు ఆందోళనలు, రైలు రోకో చేపట్టారు.
కుంభకోణం వెలుగులోకి..
వంతెన నిర్మించేందుకు అప్పట్లో ఆహ్వానించిన టెండర్లలో జే కుమార్ కంపెనీ కాంట్రాక్టు దక్కించుకుంది. ఈ ప్రతిపాదనకు స్థాయీ సమితిలో మంజూరు లభించింది. కానీ, అదే సమయంలో బీఎంసీలో రోడ్ల నిర్మాణంలో జరిగిన అవినీతి కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇందులో జే కుమార్ పేరు కూడా ఉంది. దీంతో హాంకాక్ బ్రిడ్జి కాంట్రాక్టు దక్కించుకున్న జే కుమార్‌ను పక్కన పెట్టారు. దీంతో రెండేళ్ల నుంచి పనులు పెండింగులో పడిపోయాయి. చివరకు వంతెన నిర్మాణానికి మార్గం సుగమం కావడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment