ముంబై : పొద్దుగళ్ల పొద్దుగళ్ల వడ సాంబార్ తినాలని ప్రతిఒక్కరు ఆరాటపడతారు. ఇక నాగ్‌పూర్‌లోని అజానీ స్క్వేర్‌లో స్నాక్స్ తయారీలో పాపులర్ అయిన హల్దీరామ్ నిర్వహిస్తున్న ఓ హోటల్‌కు జనం ఎగబడతారు. అక్కడ టిఫిన్స్ శుచిగా శుభ్రంగా ఉంటాయిన క్యూ కడతారు. నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి కూడా అదే చేశాడు. తన భార్యతో కలిసి వడ సాంబార్ ఆర్డర్ చేశాడు. సగం తిన్న తర్వాత ఆ వ్యక్తి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. సాంబార్‌లో బల్లి ప్రత్యక్షమవడంతో విషయం హోటల్ నిర్వాహకుల దృష్టికి తీసుకొచ్చారు. నిర్వాహకులు బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అయితే, సాంబార్‌లో బల్లిపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ విషయమై సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. ఘటనపై విచారణ చేపట్టామని ఎఫ్‌డీఏ (నాగ్‌పూర్) కమిషనర్ మిలింద్ దేశ్‌పాండే తెలిపారు.
కిచెన్‌లో ఉన్న లోపాలను గుర్తించామని, ఆహార భద్రతా, నాణ్యతా ప్రమాణాలకు లోబడి హోటల్ నడుచుకునే విధంగా ఉత్తర్వులు ఇచ్చామని చెప్పారు. కిటీకీలకు తెరలు బిగించాలని ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. అప్పటివరకు హోటల్‌ను మూసేయించామని వివరించారు. ఇక కస్టమర్ లేవెనెత్తిన ఆరోపణలపై తమకు అనుమానాలు ఉన్నాయని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. బాధితులకు చికిత్సనందించామని.. వారికి ఆరోగ్యానికి బాగానే ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వెల్లడించారు. హోటల్ నిర్వహణకు సంబంధించి అధికారులకు తగు పత్రాలు అందిచామని తెలిపారు. ఇక బాధితులు ఈ ఘటనపై మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. వారు ఎవరిపైనా ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment