
పుణే : శాఖాహారులకు, ఆల్కహాల్ ముట్టని విద్యార్థులకు మాత్రమే షెలార్ మామ బంగారు పతకాలు ఇవ్వనున్నట్లు పుణే విశ్వవిద్యాలయం పేర్కొంది. ఓ యోగా గురుకు చెందిన ట్రస్టు నేతృత్వంలో కాన్వకేషన్‌ను నిర్వహించనున్నట్లు చెప్పింది. ఈ మేరకు యూనివర్సిటీ సంబంధిత కళాశాలలకు సర్క్యూలర్ జారీ చేసింది.
ఆహారపు అలవాట్లను దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రతిభను అంచనా వేయమని సర్క్యూలర్‌లో పేర్కొన్నా.. యూనివర్సిటీ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2006 నుంచి యోగా మహర్షి రామ్‌చందర్ గోపాల్ షెలార్(షెలార్ మామ) పేరిట ఆర్ట్స్ గ్రూప్‌ల విద్యార్థులకు పుణే వర్సిటీ బంగారు పతకాలను అందిస్తోంది.
ఈ మెడల్‌ను షెలార్ ట్రస్టు, కుటుంబ సభ్యులు అందిస్తున్నారు. ఈ మెడల్ అందుకునే విద్యార్థులు శాఖాహారులై ఉండాలని, మద్యం సేవించే అలవాటు కూడా ఉండకూడదని పుణే యూనివర్సిటీ జారీ చేసిన సర్క్యూలర్‌లో పేర్కొంది. యోగా, ప్రాణాయామాలను ప్రతి రోజూ చేసే విద్యార్థులకు మొదటిగా పతకానికి అవకాశం ఇస్తారని తెలిపింది.