ఇంత విషం పీల్చుకుందామా?
► బాణసంచాలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం
► పుణె వర్సిటీ, చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్ల పరిశోధనలో వెల్లడి
► పాముబిళ్లలు, కాకరపువ్వొత్తులతో ప్రమాదం
► ఓ గదిలో 464 సిగరెట్లు కాల్చిన పొగ నిండి ఉంది..
అందులోకి మీ పిల్లల్ని పంపిస్తారా?..
74 సిగరెట్ల పొగ ఉంది.. పీల్చనిస్తారా..? అస్సలు ఆ ప్రశ్నే లేదంటారు కదా.. మరి అంత కాలుష్యంతో సమానమైన పాము బిళ్ల (దీపావళికి కాల్చే క్రాకర్)లను మాత్రం ఎన్నింటినో మీ పిల్లలతో కాల్పిస్తారు.. బాణసంచా కాల్చినప్పుడు మన ఆరోగ్యానికి ఎంతో హానికరమైన పీఎం2.5 (2.5 మైక్రాన్ల కన్నా చిన్నవైన పర్టిక్యులేట్ మ్యాటర్) కణాలు, ధూళి వంటివి పరిమితికి మించి దాదాపు 2 వేల రెట్లు ఎక్కువగా వెలువడుతాయి. కాకరపువ్వొత్తులు, తాళ్లు, చిచ్చుబుడ్లు, భూచక్రాలు, పాము బిళ్లలు, థౌజండ్ వాలాల వంటివన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారించిన పరిమితిని మించి కొన్ని వందల రెట్లు పీఎం2.5ను వెదజల్లుతున్నాయని మహారాష్ట్రలోని పుణెకు చెందిన చెస్ట్ రీసెర్చ్ ఫౌండేషన్, పుణె యూనివర్సిటీ ఇంటర్‌డిసిప్లినరీ స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ల అధ్యయనంలో వెల్లడైంది. – సెంట్రల్ డెస్క్
నిశితంగా పరిశోధన
పరిశోధకులు ‘లైట్–స్కాటరింగ్ ఫొటోమీటర్’ ద్వారా పీఎం2.5 కణాల మోతాదును పరిశీలించారు (ఈ పరికరం ఏదైనా ప్రదేశంలో కాంతిని వెదజల్లి.. అక్కడి కణాలను లెక్కించి, వాటి ద్రవ్యరాశి (మాస్)ని అంచనా వేస్తుంది). ఏయే రకం బాణసంచాను మనం ఎంత దూరం నుంచి కాలుస్తామో.. అంతే దూరంలో పరికరాన్ని ఉంచారు. ఉదాహరణకు కాకరపువ్వొత్తిని ఒక అడుగు దూరంలోను, థౌజండ్ వాలాను 6 అడుగుల దూరంలోనూ ఉంచి పీఎం2.5 లెక్కించారు. దాంతోపాటు అవి కాలుతున్నంత సేపు ఒక్కో మీటరు ఘనపరిమాణమున్న స్థలంలోకి ఒక్కో నిమిషంలో ఎంత కాలుష్యం విడుదలవుతున్నది కూడా లెక్కించారు. మొత్తంగా పాముబిళ్ల నుంచి అత్యధిక మోతాదులో ‘64,500 మైక్రోగ్రాములు/మీటర్’ కాలుష్యం వెలువడుతున్నట్లు గుర్తించారు. ఇది ఏకంగా 464 సిగరెట్ల పొగతో సమానం. కాలుష్యం విడుదలలో పాము బిళ్లల తర్వాత వరుసగా థౌజండ్ వాలా, తాళ్లు, కాకరపువ్వొత్తులు, భూచక్రాలు, చిచ్చుబుడ్లు నిలిచాయి. అంతేకాదు ఈ లెక్కలన్నీ ఒక్కో బాణసంచా కాల్చి తేల్చినవి.
పీఎం2.5 ఏమిటి?
పర్టిక్యులేట్ మ్యాటర్ అంటే గాలిలో ఉండే దుమ్ము, ధూళి, రసాయన కణాలుగా చెప్పవచ్చు. ఇవి 2.5 మైక్రాన్లకన్నా చిన్నవి (వెంట్రుక మందంలో 30వ వంతు)గా ఉంటే.. మనం శ్వాస పీల్చుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లోని లోపలి భాగాల్లోకి చొచ్చుకెళతాయి. వాటి కారణంగా ఆస్తమా, అలర్జీలు, న్యుమోనియా, కళ్లు, ముక్కుకు సంబంధించిన వ్యాధులతోపాటు గుండె జబ్బులు, ఊపిరితిత్తుల కేన్సర్ వంటివి కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. పీఎం2.5 పార్టికల్స్‌ను కేన్సర్, గుండె జబ్బులకు కారణంగా ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ కేన్సర్ రీసెర్చ్ ప్రకటించింది.
పరిమితి ఎంత?
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల ప్రకారం పీఎం2.5 పరిమితి 24 గంటల సమయంలో 25 మైక్రోగ్రాములు/మీటర్ మాత్రమే. అదే భారత ప్రభుత్వం నిర్ధారించిన ప్రమాణాల మేరకు 60 మైక్రోగ్రాములు/మీటర్ ఉండవచ్చు. కానీ పాముబిళ్ల నుంచి విడుదలవుతున్నది ఏకంగా ‘64,500 మైక్రోగ్రాములు/మీటర్’, తక్కువగా చిచ్చుబుడ్ల నుంచి విడుదలవుతున్నది 4,860 మైక్రోగ్రాములు/మీటర్ కావడం గమనార్హం. అంటే అత్యంత ప్రమాదకరమైన స్థాయిలో కాలుష్యం అన్నమాట.
విషపూరిత రసాయనాలు కూడా..
బాణసంచా కాల్చినప్పుడు పర్టిక్యులేట్ మేటర్ మాత్రమే కాదు పలు విషపూరితమైన రసాయనాలూ వెలువడతాయి. వాటిల్లో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ డయాక్సైడ్ వంటి అత్యంత ప్రమాదకరమైన వాయువులు కూడా ఉంటాయి.
పిల్లలకే ఎక్కువ ప్రమాదం
బాణసంచా వల్ల పిల్లలకు ప్రమాదం మరీ ఎక్కువ. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా కాల్చే పాముబిళ్లలు, కాకరపువ్వొత్తులు, తాళ్ల నుంచే అత్యధిక కాలుష్యం విడుదలవుతుంది. ఇవన్నీ దగ్గరగా పెట్టుకుని కాల్చేవిగనుక వారు ఎక్కువ కాలుష్యాన్ని పీల్చుకుంటారు. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న పిల్లల్లో అయితే ఈ కాలుష్యం కారణంగా విపరీత దుష్పరిణామాలు తలెత్తుతాయి.