అంగన్‌వాడీ కేంద్రంలో దొడ్డు బియ్యంతో చేసిన అన్నం పిల్లలకు వడ్డిస్తున్న దృశ్యం
నెన్నెల : అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా ప్రకటనలకే పరిమితమవుతోంది. పాఠశాలలు, వసతి గృహాల్లో ప్రభుత్వం సన్నబియ్యంతో భోజనం పెడుతుంది. అయినా అంగన్‌వాడీ కేంద్రాల్లో ఇంకా దొడ్డు బియ్యం కొనసాగిస్తున్నారు. దీంతో గర్భిణులతో పాటు చిన్నారులు అన్నం తినలేక అర్ధాకలితో ఉంటున్నారు. బండరాళ్లంటి దొడ్డు బియ్యమే వడ్డిస్తుండడంతో అన్నం గొంతులోకి దిగుతలేదని వాపోతున్నారు.
అందని పౌష్టికాహారం..
అంగన్‌వాడీ కేంద్రాల్లో దొడ్డు బియ్యమే వడ్డిస్తుండడంతో రుచికరమైన పౌష్టికాహారం ఊసే లేకుండా పోయింది. కేంద్రాల్లో చిన్నారులతో పాటు గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నారు. కానీ దొడ్డు బియ్యం పెడుతుండడంతో చాలా చోట్ల కేంద్రాల్లో తినేందుకు గర్భిణులు, బాలింతలు అనాసక్తి చూపుతున్నారు.
గొంతు దిగడం లేదు...
అంగన్‌వాడీ కేంద్రాల్లో చాలా చోట్ల గర్భిణులు, బాలింతలు భోజనం చేయడం లేదు. కానీ చిన్నారులకు మాత్రం వడ్డిస్తున్నారు. ఈ క్రమంలో దొడ్డు బియ్యం పెడుతుండడంతో చిన్నారులకు గొంతు దిగడం లేదు. చాలా వరకూ అన్నం తినకుండానే నిద్రలోకి జారిపోతున్నారు. కొద్దిపాటిగా తిన్నా అరగడం కష్టంగా మారుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. కానీ గర్భిణులు, బాలింతలు మాత్రం ఇబ్బందులకు గురికావాల్సి వస్తుంది. దొడ్డు బియ్యం తింటే కడుపు నొప్పిగా ఉంటుందని చెబుతున్నారు.ప్రగతి భవన్ సాక్షిగా అంగన్‌వాడీలతో నిర్వహించిన సమావేశంలో సీఎం కేసీఆర్ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేస్తామని ప్రకటించారు. కానీ ఆ హామీ నేటికీ నెరవేరడం లేదు. ఇప్పటికైనా అంగన్‌వాడీ కేంద్రాలకు సన్నబియ్యం సరఫరా చేసి పౌష్టికాహారం అందించాలని గర్భిణులు, బాలింతలతో పాటు చిన్నారులు కోరుతున్నారు.
కడుపు నొప్పి వస్తుంది
దొడ్డు బియ్యం తింటే కడుపులో నొప్పి వస్తుంది. అంగన్‌వాడీల్లో దొడ్డు బియ్యం పెడుతున్నారు. తినలేకపోతున్నాం. ఈ విషయాన్ని అంగన్‌వాడీ కార్యకర్తలకు చెబుతున్నాం. ఇంత వరకు సన్నబియ్యం రాలేదు. ఇలా ఉంటే చిన్నపిల్లలు ఎలా తింటారు. సన్నబియ్యం సరఫరా చేయాలి.
– ధనలక్ష్మీ, బాలింత, నెన్నెల
Comments
Please login to add a commentAdd a comment