మంచిర్యాల టౌన్ : ఐసీడీఎస్ సూపర్‌వైజర్ వేధింపులు భరించలేక అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యకు యత్నించింది. సకాలంలో ఆస్పత్రికి చేర్చడంతో ప్రస్తుతం చికిత్స పొందుతోంది. ఈ సంఘటన మంచిర్యాలలో జరిగింది. బాధితురాలి కథనం ప్రకారం.. లక్సెట్టిపేట ఐసీడీఎస్ పరిధిలోని మంచిర్యాల అర్బన్ సెక్టార్-2లోని రంగపేట అంగన్‌వాడీ కేంద్రానికి చెందిన కార్యకర్త శంకరమ్మ ఎన్టీఆర్‌నగర్‌లోని తన ఇంట్లో మంగళవారం రాత్రి క్రిమిసంహారక మందు తాగింది. గమనించిన ఆమె భర్త రాంబాబు వెంటనే మంచిర్యాల ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లాడు. వైద్యులు చికిత్స అందిస్తుండగా బాధితురాలు కోలుకుంటోంది.
ఆత్మహత్యాయత్నానికి ముందు లేఖ..
ఆత్మహత్యాయత్నానికి ముందు శంకరమ్మ లేఖ రాసి పెట్టింది. దాని ప్రకారం.. నాలుగు నెలలుగా సూపర్‌వైజర్ టి.పద్మశ్రీ డబ్బులు ఇవ్వాలని శంకరమ్మను వేధిస్తోంది. ఈ నెల 14న ఇంట్లో మెట్ల పైనుంచి కిందపడడంతో శంకరమ్మ కాలు విరిగింది. దీంతో సెలవు కావాలని వేడుకున్నా సూపర్‌వైజర్ వినిపించుకోలేదు. పైగా రూ.2 వేలు ఇస్తేనే సెలవు ఇస్తానంది. శంకరమ్మ తన భర్తతో సెలవు పత్రం పంపించినా ముందుగా డబ్బులు ఇస్తేనే సెలవు ఇస్తానని చెప్పింది. కాలు విరిగి ఇంటివద్దే ఉండడంతో రెండు నెలలుగా జీతం రాక ఇల్లు గడవని పరిస్థితి తలెత్తిందని చెప్పినా వినిపించుకోలేదు.
ఇద్దరు అంగన్‌వాడీ కార్యకర్తలను అంగన్‌వాడీ కేంద్రానికి పంపించి ఆగస్టు, సెప్టెంబర్ సరుకులు, ఆహారం పంపిణీ చేయించి శంకరమ్మను ఉద్యోగం నుంచి తొలగిస్తానని ఆమె భర్తకు సూపర్‌వైజర్ చెప్పింది. దీంతో బాధితురాలు మానసిక ఆందోళనకు గురైంది. అదే బెంగతో ఆత్మహత్యకు యత్నించినట్లు ఆ లేఖలో శంకరమ్మ పేర్కొంది. బుధవారం విషయం తెలిసి లక్సెట్టిపేటతోపాటు చెన్నూర్, బెల్లంపల్లి ఐసీడీఎస్‌ల పరిధిలోని వివిధ మండలాల అంగన్‌వాడీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకొని బాధితురాలిని పరామర్శించారు.
కార్యకర్తల రాస్తారోకో..
శంకరమ్మకు న్యాయం చేయాలని, సూపర్‌వైజర్ పద్మశ్రీని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల ప్రభుత్వాస్పత్రి ఎదుట జాతీయ రహదారిపై అంగన్‌వాడీ కార్యకర్తలు గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఎస్సై ఎస్‌కె.లతీఫ్ ఆందోళన విరమించాలని కోరినా కార్యకర్తలు వినిపించుకోలేదు. ఆర్డీవో వచ్చి బాధితురాలికి న్యాయం చేయాలని నినదించారు.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా..
ఆర్డీవో అయేషా మస్రత్ ఖానమ్ ఆస్పత్రి వద్దకు చేరుకొని ఆందోళనకారులతో మాట్లాడారు. కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. ఆందోళన విరమించాలని, సంఘటనపై విచారణ జరిపి సూపర్‌వైజర్‌పై చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆస్పత్రిలో శంకరమ్మను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమస్య కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి బాధితురాలికి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. లక్సెట్టిపేట ఐసీడీఎస్ సీడీపీవో శంకరయ్య మాట్లాడుతూ ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆందోళనలో అంగన్‌వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు సురేఖ, పుష్ప, అరుణ, కుసుమ, సీఐటీయూ నాయకుడు ప్రేమ్‌కుమార్, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
Published Thu, Aug 28 2014 3:11 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement