
చిన్నశంకరంపేట (మెదక్): తాను ఇంకా చదువుకుంటానని, ఇప్పుడే పెళ్లి వద్దంటూ ఓ బాలిక పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం కామారం తండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన హలావత్ బాబు, మరోనిల కూతురు సాంకీ ఇంటర్ చదువుతోంది. ఆమెను మేనబావకు ఇచ్చి పెళ్లి చేద్దామని తండ్రి బాబు తరచూ ఇంట్లో చర్చిస్తున్నాడు.
తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని, ఇంకా చదువుకుంటానని బాలిక తండ్రికి చెబుతున్నప్పటికీ వినకపోగా, బెదిరించడం, కొట్టడం మొదలు పెట్టారు. దీంతో మైనర్‌ను అయినప్పటికీ పెళ్లి చేస్తానని తన తండ్రి వేధిస్తున్నాడని సాంకీ చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాశ్‌గౌడ్‌కు ఫిర్యాదు చేసింది. ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్‌లతో కలసి ఆయన బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అమ్మాయి చదువుకు ఎలాంటి ఆటంకం కలిగించొద్దని, అవసరమైతే బాలసదనంలో ఉంచి చదివించనున్నట్లు ఎస్‌ఐ వివరించారు. సాంకీ కోరిక మేరకు ఆమె మేనమామ గంగారామ్‌కు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment