విలన్ గానే పరిపూర్ణ నటన ప్రదర్శించా..
తాను ప్రతినాయకుడిగానే పరిపూర్ణ నటనను ప్రదర్శించానని సూపర్‌స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. యువ నటుడు విజయ్‌సేతుపతి, తమన్నా జంటగా నటించిన చిత్రం ధర్మదురై. శీనురామసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నటుడు, నిర్మాత ఆర్‌కే.సురేశ్ నిర్మించారు. కాగా ఈ చిత్రం మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ రోజుల్లో ఎంత మంచి చిత్రం అయినా రెండు వారాలు ఆడడం గగనంగా మరిదన్న విషయం తెలిసిందే. అలాంటిది ధర్మదురై చిత్రం ఇటీవల శతదినోత్సవ వేడుకను కూడా జరుపుకుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను కలిసి చిత్ర వందరోజుల జ్ఞాపికను అందించి ఆయన అభినందనలు అందుకున్నారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ధర్మదురై చిత్రంలో కథానాయకుడు విజయ్‌సేతుపతి, తమన్నా, రాధికాశరత్‌కుమార్, ఎంఎస్.భాస్కర్‌ల నటన తనను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు.
అదే విధంగా దర్శకుడు శీనురామసామి తన ప్రతి చిత్రంలోనూ చక్కని సందేశం ఉండేలా కథలను తయారు చేసుకుంటున్నారని అభినందించారు. తాను విలన్ గా నటిస్తున్న సమయంలోనే సంపూర్ణ నటనను ప్రదర్శించగలిగానని, అదే విధంగా ధర్మదురై, మరుదు చిత్రాల్లో చక్కని విలనిజాన్ని ప్రదర్శించి ఈ చిత్ర నిర్మాత ఆర్‌కే.సురేశ్ మంచి నటుడిగానూ ఎదుగుతున్నారని ప్రశంసించారు. దర్శకుడు శీనురామసామి తన స్పందనను తెలియజేస్తూ, రజనీకాంత్ నటించిన ముల్లుం మలరుం, కాళీ వంటి చిత్రాల ప్రభావంతో తాను సినీరంగంలోకి వచ్చానన్నారు. అలాంటిది ఇవాళ రజనీకాంత్‌ను ప్రత్యక్షంగా కలుసుకోవడం, తమ చిత్ర వంద రోజుల జ్ఞాపికను ఆయనకు అందించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు.