
హాలీవుడ్ సినీ అభిమానులకు డిసెంబర్ నుంచి ఖాళీ అన్నదే ఉండదు. క్రిస్మస్ సినిమాలు చూడాలి. ఆ వెంటనే న్యూ ఇయర్ సినిమాలు. సంవత్సరం అయిపోతుంది కాబట్టి అవార్డుల నామినేషన్స్. నామినేషన్స్ దక్కించుకున్న సినిమాలు ఏమైనా చూడకుంటే అవి చూసెయ్యాలి. ఇవి ఫినిష్ చేసేలోపు గోల్డెన్ గ్లోబ్ అవార్డులు ఇచ్చేస్తారు. వెంటనే ఆస్కార్ నామినేషన్స్. ఆ తర్వాత వాటి రిజల్ట్. వరుసగా సినిమాలే సినిమాలు. ఈ హడావిడి అంతా ఉంటుంది కాబట్టే ఏడాది ప్రారంభంలో హాలీవుడ్ కళకళలాడిపోతుంది. ఈ ఏడాది అప్పుడే అవార్డుల పండగ వాతావరణం మొదలైంది. మార్చి నెలలో ఆస్కార్ అవార్డుల ప్రదానం ఉంటుంది. నామినేషన్స్ ఈ నెలఖార్లో ప్రకటిస్తారు.
అంతకుముందే, అంటే ఇవాళ్టినుంచే గోల్డెన్ గ్లోబ్ రూపంలో అవార్డుల సందడి మొదలవుతోంది. ఈ ఉదయం 7 గంటల 30 నిమిషాలకు కలర్స్ ఇన్ఫినిటీ చానెల్లో గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్ లైవ్ ఉంటుంది. ఇదే రికార్డెడ్ ప్రోగ్రామ్ రాత్రి 9 గంటలకు కూడా ఉంటుంది. ఈ ఏడాది ‘ది పోస్ట్’, ‘డంకర్క్’, ‘షేప్ ఆఫ్ వాటర్’ లాంటి మహామహా సినిమాలు పోటీ పడుతుండడంతో గోల్డెన్ గ్లోబ్ ఏ సినిమాకు దక్కుతుందని, ఏ సినిమా ఎక్కువ అవార్డులు కొట్టేస్తుందని అంతా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ అవార్డుల ప్రదానం జరిగిందంటే, ఆస్కార్ ఏ సినిమాలకు వస్తుందన్న దానికి కూడా సగం సమాధానం దొరికేసినట్టే!! ఎందుకంటే గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కినవారికి ఆస్కార్ దక్కే ఆస్కారం ఎక్కువ.
Comments
Please login to add a commentAdd a comment