భారతీయ కట్టు.. భలే ఆకట్టు | Kristen Bell Getting Ready for the 2019 Golden Globe Awards | Sakshi
Sakshi News home page

భారతీయ కట్టు.. భలే ఆకట్టు

Published Tue, Jan 8 2019 12:34 AM | Last Updated on Tue, Jan 8 2019 12:34 AM

Kristen Bell Getting Ready for the 2019 Golden Globe Awards - Sakshi

లేడీ గాగా, క్రిస్టిన్‌ బేల్‌

హాలీవుడ్‌లో అవార్డ్స్‌ సీజన్‌ మొదలైంది. ఈ సీజన్‌కు శ్రీకారం చుట్టేది గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌. ప్రతి ఏడాది జనవరిలో ఈ వేడుక జరుగుతుంది. 76వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌ ఫంక్షన్‌ సోమవారం ఉదయం (భారతకాలమాన ప్రకారం) జరిగింది. ఎన్నో విశేషాలతో పాటు పలు ఆశ్చర్యాలు కూడా ఈ వేడుకలో చోటు చేసుకున్నాయి.

అన్ని అవార్డ్స్‌ చేజిక్కించుకుంటాయనుకున్న సినిమాలు ఉత్త చేతులతో వెళ్లడం, అంచనాలు లేకుండా వచ్చినవి  ఉత్తమ చిత్రాలుగా మిగలడం, నటుడిగా క్రిస్టిన్‌ బేల్‌ తొలి అవార్డు దక్కించుకోవడం, ఎన్నో అవార్డులు కైవసం చేసుకుంటుందనుకున్న ‘స్టార్‌ ఈజ్‌ బోర్న్‌’ చిత్రం కేవలం ఒక్క అవార్డ్‌తో సరిపెట్టుకోవడం, అంచనాలు లేని ‘గ్రీన్‌ బుక్‌’ సినిమా అనూహ్యంగా ఎక్కువ అవార్డ్స్‌ సంపాదించడం, సూపర్‌ హీరో (బ్లాక్‌ పాంథర్‌) సినిమా గ్లోబ్‌ అవార్డ్స్‌కు నామినేట్‌ అవ్వడం ఇదే తొలిసారి.

పొడుగు గౌన్లతో రెడ్‌ కార్పెట్‌ మీద వయ్యారంగా కొందరు తారలు వాక్‌ చేస్తే, ఎర్ర తివాచీపై చీరగాలి కూడా తగలడం మరో విశేషం. ఆస్కార్‌కు ముందుగా జరిగే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌ కేవలం సినిమాలకే కాదు టెలివిజన్‌కు కూడా అవార్డ్స్‌ అందిస్తుంది. మొత్తం  25 విభాగాల్లో అవార్డ్స్‌ అందించే ఈ షోలో 14 విభాగాలు సినిమాకు, 11 విభాగాలు టెలివిజన్‌కు అందిస్తారు..  ‘గోల్డెన్‌ గ్లోబ్‌ విన్నర్‌’ అనే ట్యాగ్‌ ఆస్కార్‌ అవార్డ్‌ ఓటింగ్‌లో ఎంతో కొంత ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు.

మొదటి గ్లోబ్‌ అవార్డ్‌
పాత్రలా మారడానికి శరీరాన్ని ఎలా కావాలంటే అలా మార్చుకుంటుంటారు నటుడు క్రిస్టిన్‌ బేల్‌. ఇప్పటికే మూడుసార్లు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో నామినేషన్‌ సంపాదించినప్పటికీ నిరాశతోనే వెనుదిరిగారు. కానీ ‘వైస్‌’లో చేసిన అమెరికన్‌ వైజ్‌ ప్రెసిడెంట్‌ ఆడమ్‌ మెక్కే పాత్రకు ఆయన తొలి గ్లోబ్‌ అవార్డుని అందుకున్నారు. ఈ పాత్ర కోసం సుమారు నలభై పౌండ్ల (20 కిలోల) బరువు పెరగడంతోపాటు కనుబొమలను బ్లీచ్‌ చేయించుకున్నారు. 2011లో సహాయ నటుడి (ది ఫైటర్‌)గా ఈ అవార్డ్‌ అందుకున్నప్పటికీ బెస్ట్‌ యాక్టర్‌గా తొలి అవార్డ్‌ ఇది.

కార్పెట్‌పై చీరగాలి
రెడ్‌ కార్పెట్‌పై ఎక్కువగా పొడుగు గౌన్లు మాత్రమే కనిపిస్తాయి. కానీ తొలిసారి ఈ కార్పెట్‌కు చీరగాలిని తగిలించారు బాలీవుడ్‌ భామ మనస్వీ మంగై. ఈ అవార్డ్స్‌ ఫంక్షన్స్‌కు ప్రియాంకా చోప్రా హైలైట్‌గా నిలుస్తారని ఊహించారంతా కానీ ఆమె హాజరు కాలేదు. అప్పటివరకూ వస్తున్న గౌన్ల ట్రెండ్‌ని పక్కన పెట్టి, మనస్వీ మంగై చీరలో ప్రత్యక్షం కావడం వీక్షకులను ఆశ్చర్యపరిచింది. ‘టాక్‌ ఆఫ్‌ ది ఈవినింగ్‌’ అయ్యారామె. ‘‘హాలీవుడ్‌కు ఇది ఫస్ట్‌ అవార్డ్‌ సీజన్, అలాగే నాకు కూడా. అందుకే ఈ ఫంక్షన్‌కు కొత్తగా మన భారతీయ స్టైల్‌లో డ్రెస్‌ చేసుకుందాం అనుకున్నాను. అందుకే చీర కట్టుకుని హాజరయ్యాను. ఇక్కడి ప్రెస్, హాలీవుడ్‌ నటీనటులు చాలా మంది నేనెవర్ని, ఆ డ్రెస్సింగ్‌  స్టైల్‌ ఏంటి? అని కనుక్కున్నారు’’ అంటూ తన ఫస్ట్‌ అవార్డ్‌ ఫంక్షన్‌ ఆనందాన్ని పంచుకున్నారు మనస్వి.

అవార్డ్స్‌ లిస్ట్‌ :
బెస్ట్‌ డైరెక్టర్‌: అల్ఫోన్సో కువారన్‌ (రోమా)
ఉత్తమ చిత్రం: గ్రీన్‌ బుక్‌
ఉత్తమ నటుడు (డ్రామా): రామి మలెక్‌ (బోమియన్‌ రాప్సొడీ)
ఉత్తమ నటుడు (కామెడీ, మ్యూజికల్‌): క్రిస్టిన్‌ బేల్‌ (వైస్‌)
విదేశీ చిత్రం: రోమా
ఒరిజినల్‌ సాంగ్‌: షాలో (స్టార్‌ ఈజ్‌ బోర్న్‌)
ఒరిజినల్‌ స్కోర్‌: జస్టిన్‌ హర్విట్జ్‌ (ఫస్ట్‌ మ్యాన్‌)
యానిమేషన్‌ మూవీ: స్పైడర్‌ మేన్‌–ఇన్‌ టు ది స్పైడర్‌ వెర్స్‌
స్క్రీన్‌ ప్లే: నిక్‌ వెల్లెలోంగ, బ్రియన్‌ క్యూరీ, పీటర్‌ ఫరేల్లీ  (గ్రీన్‌బుక్‌)
సహాయ నటుడు: మహేర్షలా అలీ (గ్రీన్‌ బుక్‌)
సహాయ నటి: రెగీనా కింగ్‌ (ఈఫ్‌ బీల్‌ స్ట్రీట్‌ కుడ్‌ టాక్‌)



మనస్వీ మంగై, దీపికా పదుకోన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement