'24' మూవీ రివ్యూ
టైటిల్ : 24
జానర్ : సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్
తారాగణం : సూర్య, సమంత, నిత్యామీనన్, అజయ్, శరణ్య
సంగీతం : ఏఆర్ రెహమాన్
దర్శకత్వం : విక్రమ్ కె కుమార్
నిర్మాత : 2డి ఎంటర్టైన్మెంట్స్
ప్రయోగాత్మక చిత్రాలకు ఎప్పుడు ముందుండే సౌత్ ఇండస్ట్రీ వర్సటైల్ స్టార్ సూర్య హీరోగా, డిఫరెంట్ కాన్సెప్ట్లతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన సినిమా 24. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ సినిమాలో సూర్య మూడు పాత్రల్లో కనిపించాడు. ఇటీవల కాలంలో తన స్థాయికి తగ్గ హిట్ ఇవ్వటంలో విఫలమవుతున్న సూర్య ఈ సినిమా సక్సెస్పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి సూర్య సక్సెస్ కోసం కాలంలో చేసిన ఈ ప్రయాణం సక్సెస్ అయ్యిందా..?
కథ :
డాక్టర్ శివకుమార్ (సూర్య), ఓ సైంటిస్ట్. కాలాన్ని నియంత్రించగల వాచ్ తయారు చేయాలని తపిస్తుంటాడు. అనుకున్నట్టుగా అతడు ఓ రోజు ఆ వాచ్ను కనిపెడతాడు. శివకుమార్ కవల సోదరుడైన ఆత్రేయ(సూర్య), ఆ వాచ్ను సొంతం చేసుకొని ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకోవాలని భావిస్తాడు. శివకుమార్, అతని భార్య ప్రియ(నిత్యామీనన్), కొడుకును చంపి వాచ్ దక్కించుకోవాలనుకుంటాడు. కానీ శివకుమార్ వాచ్తో పాటు తన కొడుకును తప్పించి ఆత్రేయ చేతిలో చనిపోతాడు. వాచ్ కోసం శివకుమార్ వెంటపడిన ఆత్రేయ కూడా ప్రమాదానికి గురై 26 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోతాడు.
పెరిగి పెద్దవాడైన శివకుమార్ కొడుకు మణి(సూర్య) వాచ్ మెకానిక్గా పనిచేస్తుంటాడు. చిన్నతనం నుంచి తనతో ఉన్న వాచ్ శక్తి గురించి తెలుసుకున్న మణి, అదే సమయంలో తనకు పరిచయం అయిన సత్య(సమంత)ను ప్రేమలో పడేయడానికి వాచ్ని ఉపయోగిస్తాడు. కాలంలో ప్రయాణిస్తూ సత్యను ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కోమా నుంచి బయటకు వచ్చిన ఆత్రేయ, తన అనుచరుడు మిత్రా(అజయ్) సాయంతో వాచ్ కోసం వెతకటం ప్రారంభిస్తాడు. ఆ వాచ్ మణి దగ్గర ఉందని తెలుసుకున్న ఆత్రేయ ఏం చేశాడు..? మణికి తన గతం ఎలా తెలిసింది..? ఆత్రేయ ఎలా అంతమయ్యాడు..? చివరకు ఆ వాచ్ ఏం అయ్యింది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
మూడు పాత్రల్లో కనిపించిన సూర్య మరోసారి అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇప్పటి వరకు పాజిటివ్ పాత్రలు మాత్రమే చేసిన సూర్య తొలిసారిగా నెగెటివ్ రోల్ లోనూ మెప్పించాడు. ఆత్రేయ పాత్రలో వీల్ చైర్లో కూర్చొని కూడా క్రూరమైన విలన్గా కనిపించాడు. సమంత పాత్ర కేవలం గ్లామర్ కే పరిమితమైంది. కథతో సంబంధం లేకపోవటంతో పర్ఫామెన్స్కు స్కోప్ లేకుండా పోయింది. తెరపై కనిపించింది కొద్దిసేపే అయినా నిత్యామీనన్ తనదైన నటనతో అలరించింది. సెంటిమెంట్ సీన్స్లో తన మార్క్ పర్ఫామెన్స్ చూపించి బెస్ట్ అనిపించుకుంది. చాలా కాలం తరువాత ఫుల్లెంగ్త్ రోల్లో కనిపించి అజయ్, మిత్రా పాత్రలో పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు.
సాంకేతిక నిపుణులు :
రొటీన్ సినిమాలకు భిన్నంగా ఏదో ఒక ప్రయోగంతో అలరించే దర్శకుడు విక్రమ్ కె కుమార్, 24 సినిమా విషయంలోనే అదే ఫార్ములాను ఫాలో అయ్యాడు. మెయిన్ కథ విషయంలో మంచి పట్టు చూపించిన దర్శకుడు, లవ్ సీన్స్ను మాత్రం బోరింగ్ గా తెరకెక్కించాడు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య వచ్చే సన్నివేశాల్లో హీరో ఒకే డైలాగ్ ను పదే పదే చెప్పటం విసుగు తెప్పిస్తుంది. రెహమాన్ సంగీతం ఆశించిన స్థాయిలో లేదు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగానే ఉన్నా పాటలు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి. సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సూర్య
మెయిన్ స్టోరి లైన్
స్క్రీన్ ప్లే
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లవ్ సీన్స్
మాస్ను మెప్పించే కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవటం
సంగీతం
ఓవరాల్గా 24, సూర్య లోని విలక్షణ నటుణ్ని మరోసారి వెండితెర మీద ఆవిష్కరించిన ప్రయోగం
- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్