ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇటీవల రిలీజైన సమంత మూవీ యశోదపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. సినిమా చాలా బాగుందని ఆయన ప్రశంసించారు. ఈ మూవీ ఓ సందేశాత్మక చిత్రమని కొనియాడారు. హీరోయిన్ పాత్రకు అధిక ప్రాధాన్యతనిస్తూ సినిమా తెరకెక్కించారని తెలిపారు. ఈ చిత్రంలో సమంత చాలా బాగా చేసిందని.. ఆమె అద్భుతమైన నటి అంటూ పొగడ్తలతో ముంచెత్తారు.
దర్శకులు హరి, హరీశ్ సమంత పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారని పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసించారు. అయితే విజయశాంతి నటించిన కర్తవ్యం సినిమాలాగా.. యశోద మూవీని ఆమె చేస్తే మరింత బాగుండేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విజయశాంతి ఇలాంటి పాత్రలను అవలీలగా చేయగలదన్నారు. అందం కోసం చిన్నపిల్లల ప్లాస్మాను ఉపయోగించడం.. దీని వెనుక కోట్ల రూపాయల వ్యాపారం.. దీన్ని కనిపెట్టడం కోసం సమంత చేసిన ప్రయత్నం చాలా బాగుందని పరుచూరి కొనియాడారు. సినిమాలోని చివరి 40 నిమిషాలు చూస్తే భయం వేస్తుందన్నారు. యశోద ఓ అద్భుతమైన ప్రయోగమని తెలిపారు. యశోద చిత్రాన్ని చూసినప్పుడు ఒక స్త్రీని హీరోగా ఎలా చూపించాలో ఇందులో నేర్చుకోవచ్చని ఆయన సలహా ఇచ్చారు. చివరిగా నా కోసమైనా ఈ సినిమాను ఒక్కసారి చూడండని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment