49-ఒ ఎవరి కోసం?
తెలుగు చిత్రపరిశ్రమకు సంబంధించిన ఏ వార్త అయినా ముందుగా ఫిలిం నగర్‌లో హల్‌చల్ చేస్తుంది. ఆ నోటా ఈ నోటా ఆ వార్త జోరుగా షికారు చేస్తూ, తమిళ, కన్నడ.. ఇలా ఇతర రంగాల వరకూ వెళ్లిపోతుంది. అదే తమిళ పరిశ్రమకు అయితే ‘కోడంబాక్కం’ ఏరియా మంచి అడ్డా. ఇప్పుడు అక్కడ రామ్ చరణ్ గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. ఆ వార్త అక్కణ్ణుంచి హైదరాబాద్ వరకూ షికారు చేసేసింది. ఓ తమిళ చిత్రం రీమేక్ హక్కులను రామ్‌చరణ్ దక్కించుకున్నారన్నది ఆ వార్త. ఆ చిత్రవిశేషాల్లోకి వస్తే... తమిళంలో స్టార్ కమెడియన్‌గా వెలిగినవాళ్లల్లో గౌండమణి ఒకరు. 1970లలో నటుడిగా రంగప్రవేశం చేసి, దాదాపు మూడు దశాబ్దాలు తన కామెడీతో ప్రేక్షకులను తెగ నవ్వించారాయన. ఆ తర్వాత జోరు తగ్గించారు. అడపా దడపా మాత్రమే సినిమాలు చేస్తున్నారు. విశేషం ఏంటంటే, ఆయన హీరోగా ఇటీవల ‘49-ఒ’ అనే చిత్రం రూపొందింది. దర్శకుడు గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన పి. ఆరోగ్యదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఇటీవల విడుదలైంది. సినిమాకి ‘ఓహో’ అని రెస్పాన్స్ రాకపోయినా గౌండమణి కోసం, సినిమాలో ఉన్న కంటెంట్ కోసం చూడాల్సిందే అని తమిళ పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.
ఇటీవల ఈ చిత్రాన్ని రామ్‌చరణ్ చూశారని బోగట్టా. కంటెంట్ బాగా నచ్చడంతో రీమేక్ హక్కులు కూడా చేజిక్కించుకున్నారని చెన్నయ్ టాక్. రామ్‌చరణ్ ఈ చిత్రం రీమేక్ హక్కులు ఎందుకు దక్కించుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. సొంత సంస్థ ఆరంభించి, ఆయన చిన్న సినిమాలు నిర్మించాలనుకుంటున్న విషయం తెలిసిందే. దానికోసమే ఈ సినిమా కొన్నారా? లేక తన తండ్రి చిరంజీవి 150వ సినిమాకి ఆ కథ బాగుంటుందని కొన్నారా? లేక ఈ కథలో తానే హీరోగా నటించాలని రామ్‌చరణ్ అనుకుంటున్నారా? అసలు నిజంగానే ‘49-ఒ’ హక్కులను చరణ్ దక్కించుకున్నారా?.. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.