పాటకు అయిదు కోట్లా! | 5 Crores for each song! | Sakshi
Sakshi News home page

పాటకు అయిదు కోట్లా!

Published Tue, Apr 22 2014 11:23 PM | Last Updated on Sat, Sep 2 2017 6:23 AM

పాటకు అయిదు కోట్లా!

పాటకు అయిదు కోట్లా!

సినిమాకు అయిదు కోట్ల రూపాయలు నిర్మాణ వ్యయం కావడం సహజం. కానీ... ఒక పాటకు అయిదు కోట్లు ఖర్చయిందంటే ఆ సినిమాను ఏమనాలి? శంకర్ సినిమా అనాలి. ఎందుకంటే... ఒక పాటకు అంత ఖర్చు పెట్టించే సామర్థ్యం ఒక్క శంకర్‌కే ఉంది. ఆయన సినిమాలకు వసూళ్లు కూడా అదే స్థాయిలో వస్తాయి. అందుకే... నిర్మాతలు కూడా భయం లేకుండా డబ్బుని ఖర్చు చేస్తుంటారు. ప్రస్తుతం ఆయన విక్రమ్ హీరోగా ‘ఐ’ (తెలుగులో ‘మనోహరుడు’) చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఆస్కార్ రవిచంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
  ఇటీవల ఈ సినిమా కోసం శంకర్ ఓ పాటను చిత్రీకరించారు. అమీజాక్సన్, ఉపెన్ పటేల్‌పై తీసిన ఈ పాటను ముందు చెన్నయ్‌లో మొదలు పెట్టారు. అక్కడ్నుంచీ ప్రపంచమంతా తిరుగుతూ మనసుకు నచ్చిన పలు ప్రదేశాల్లో ఈ పాటను శంకర్ రూపొందించారట. మళ్లీ చెన్నయ్ చేరుకొని ఓ భారీ సెట్‌లో ఈ పాట చిత్రీకరణ ముగించారు. దీనికి శంకర్ తీసుకున్న సమయం పది రోజులు. ఇంతకీ ఖర్చు ఎంతయ్యిందని లెక్క చూసుకుంటే అయిదు కోట్లు అని తేలింది. దీంతో యూనిట్ అంతా షాక్. ‘ధూమ్3’లో ఆమిర్‌ఖాన్, కత్రినాకైఫ్‌పై తీసిన పాటకు రెండు కోట్లు ఖర్చయిందని గతంలో వార్తలొచ్చాయి.
 
 అంటే ఆమిర్ లాంటి సూపర్‌స్టార్ నటించిన బాలీవుడ్ సినిమాకే పాటకు రెండు కోట్లంటే పెద్ద మొత్తం అన్నమాట. మరి దక్షిణాదికి చెందిన ఓ ప్రాంతీయ భాషా చిత్రానికి సంబంధించిన పాటకు అయిదు కోట్లు ఖర్చు పెట్టడం నిజంగా సాహసమే. పైగా అది హీరో విక్రమ్‌పై తీసిన పాట కాకపోవడం గమనార్హం. పదహారేళ్ల క్రితం వచ్చిన ‘జీన్స్’ చిత్రంలో కూడా ప్రపంచంలోని ఏడు వింతల నేపథ్యంలో ‘పూవుల్లో దాగున్న పళ్లెంతో అతిశయం’ పాటను అతి మనోహరంగా తీశారు శంకర్. మరీ ఈ పాట ఎలా ఉంటుందో చూడాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement