నిజజీవితానికి దగ్గరగా ఉండే పాత్రలు లభిస్తే ఎవరైనా తేలిగ్గా నటించేస్తారు. అయితే.. సంబంధం లేని సంప్రదాయాన్ని, తెలీని నడవడికను తనదిగా చేసుకొని నటించమంటే మాత్రం అందరూ చేయలేరు. అలా యాక్ట్ చేయడం నిజంగా కత్తి మీద సామే. ప్రస్తుతం లండన్ బ్యూటీ అమీ జాక్సన్ అలాంటి పాత్రనే చేస్తున్నారు. తనకు ఏ మాత్రం సంబంధంలేని సంప్రదాయంలోకి ఆమె ఒదిగిపోతున్నారు. అమీ చేస్తోంది నిజంగా సాహసమే అని చెప్పాలి. ప్రస్తుతం ఈ తెల్లజాతి పిల్ల ‘ఐ’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
విక్రమ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం తెలుగులో ‘మనోహరుడు’గా విడుదల కానుంది. ఈ సినిమాలో అమీ... బ్రాహ్మణ యువతి ‘మణియమ్మాళ్’గా నటిస్తున్నారు. జన్మతః అమీ క్రిస్టియన్. పైగా పుట్టింది లండన్‌లో. బ్రాహ్మణ సంప్రదాయం గురించి కాని, మడి, ఆచార వ్యవహారాల గురించి కాని, పూజా పురస్కారాల గురించి కానీ తనకు అస్సలు తెలీదు. అలాంటి అమీ.. తను ఎన్నడూ చూడని, తనకు తెలీని జీవితాన్ని కెమెరా ముందు ఆస్వాదిస్తుండటం పట్ల సంతోషాన్ని వెలిబుచ్చారు. ఈ పాత్ర గురించి ఇటీవల ఆమె చెబుతూ -‘‘ఈ పాత్ర చేస్తుంటే... నేను ఇండియాలో ఎందుకు పుట్టలేదా అనిపిస్తోంది.
ఈ లైఫ్ చాలా బాగుంది. నా నడకను, నా కదలికల్ని, నా చూపుల్ని ఓ విధంగా చెప్పాలంటే నన్నే మార్చేశారు శంకర్. రాయిని శిల్పంగా ఎలా మలచవచ్చో... నన్ను శంకర్ తీర్చిదిద్దుతున్న విధానాన్ని చూస్తే తెలిసింది. ఆయన ఊహలో కనిపించిన ‘మణియమ్మాళ్’కు నేను ప్రతిరూపాన్ని నేను కావడం నిజంగా నా లక్. ఏడాది పాటు వేరే ప్రాజెక్ట్ ఒప్పుకోకుండా ఈ సినిమా చేస్తున్నాను. నా జీవితంలో మరిచిపోలేని పాత్ర ఇది’’ అని చెప్పుకొచ్చారు అమీ.
శంకర్ ఊహకు నేను ప్రతిరూపం కావడం నా అదృష్టం
Published Tue, Nov 5 2013 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 12:16 AM
Advertisement