శేఖర్‌రెడ్డి ఎర్ర
‘‘కొందరు ప్రేక్షకులకు కుటుంబకథా చిత్రాలు నచ్చుతాయి. మరికొందరికి యాక్షన్, ఇంకొందరికి థ్రిల్లర్.. ఇలా డిఫరెంట్ జానర్ ఆడియన్స్ ఉంటారు. అన్ని రకాల పేక్షకులను సంతృప్తిపరచేలా సినిమా తీయడం చాలా కష్టం. కానీ ఈ విషయంలో నా ప్రయత్న లోపం లేకుండా చూసుకుంటాను’’ అన్నారు శేఖర్‌రెడ్డి. కార్తికేయ, నేహా సోలంకి జంటగా నటించిన చిత్రం ‘90 ఎంఎల్’. శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ చిత్రం వచ్చే నెల 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా శేఖర్ చెప్పిన విశేషాలు.
► నేను నల్గొండ జిల్లా లింగరాజుపల్లిలో పుట్టాను.. హైదరాబాద్‌లో పెరిగాను. ఆసక్తితో సినిమా రంగంవైపు వచ్చాను. చంద్రమహేశ్‌గారి దగ్గర అసిస్టెంట్, అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేశాను. కొన్ని సినిమాలకు రచయితగా కూడా ఉన్నాను. నాలో డైరెక్షన్, రైటింగ్ ఇలా రెండు స్కిల్స్ ఉన్నాయి.
► ‘90ఎంఎల్’ దర్శకునిగా నా తొలి సినిమా. టైటిల్ వినగానే ఇది లిక్కర్ నేపథ్యంలో సాగే చిత్రం అని కొందరు ఊహించుకుంటారు. కానే కాదు. ఇది తాగుబోతుల సినిమా కాదు. భావోద్వేగ అంశాలకు వాణిజ్యపరమైన అంశాలు జోడించి ఈ సినిమాను తెరకెక్కించాం. మంచి వినోదాత్మకంగా ఉంటుంది.
► తన పిల్లాడికి పాలు ఇవ్వాల్సిన తల్లికి.. లిక్కర్ ఇవ్వాల్సి వస్తే ఆ తల్లి మనసు ఎంత బాధపడుతుందో సినిమాలో చూపించాం. అంతేకానీ మందు సీన్లు పెట్టలేదు. మందు తాగమని ప్రోత్సహించే సన్నివేశాలను తెరకెక్కించలేదు.
► మందు తాగకపోతే బతకలేని ఓ డిజార్డర్ ఉన్న వ్యక్తి దేవదాసు పాత్రలో కార్తికేయ నటించారు. అసలు లిక్కర్ వాసన అంటేనే పడని ఓ కుటుంబంలోని అమ్మాయితో దేవదాసు ప్రేమలో పడతాడు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయన్న అంశాలు సినిమాలో ఆసక్తికరంగా ఉంటాయి.
► తమిళంలో మా సినిమా టైటిల్‌తోనే ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాకు, మా సినిమాకు ఏ సంబంధం లేదు. అలాగే మా ‘90 ఎంఎల్’ చిత్రంపై ‘ఆర్‌ఎక్స్ 100’ సినిమా ప్రభావం పడదు. టైటిల్ వల్ల మా సినిమాకు ప్రేక్షకులు దూరంగా ఉంటారు అంటే నేను కాదనే అంటాను. ఎందుకంటే ఇప్పుడు మార్నింగ్ షో పడగానే కథ, సినిమా టాక్ బయటకు వచ్చేస్తుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం ఉంది.
► నిర్మాత అశోక్‌రెడ్డిగారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. నా నెక్ట్స్ సినిమా గురించి ఇంకా ఏమీ అనుకోలేదు.
Comments
Please login to add a commentAdd a comment