తమిళసినిమా: ఇన్నాళ్లకు సంఘమిత్ర చిత్రానికి కథానా యకి సెట్ అయ్యింది. సంఘమిత్ర 8వ శతాబ్దం లో సాగే కథా చిత్రంగా ఉంటుందట. ఆ కాలపు చారిత్రక కథను దర్శకుడు సుందర్.సీ చేపట్టారు. చిత్రాన్ని శ్రీతేనాండాళ్ ఫిలింస్ సంస్థ సుమారు రూ.150 కోట్ల బడ్జెట్‌తో నిర్మించతలపెట్టిం ది. ఇందులో మొదట విజయ్, టాలీవుడ్ నటుడు మహేశ్‌బాబుల వద్ద నుంచి కథానాయకుల ఎంపిక సాగింది. చివరికి జయంరవి, ఆర్య సెట్ అయ్యారు.
ఇక కథానాయకి విషయానికి వస్తే చాలా మంది నటీమణుల పేర్లు చర్చకు వచ్చాయి. అయితే శ్రుతీహాసన్ పేరు ఖరారైంది. ఇందు కోసం ఈ బ్యూటీ కత్తిసాము, విలువిద్యను కెనడాలో శిక్షణ పొందారు కూడా. అంతే కాదు ఆరు నెలల క్రితం ఫ్రాన్స్‌లో జరిగిన కేన్స్ చిత్రోత్సవాల్లో జరిగిన సంఘమిత్ర పరిచయ కార్యక్రమంలోనూ హల్‌చల్ చేశారు. అలాంటిది ఆ తరువాత అనూహ్యంగా చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో మళ్లీ హీరోయిన్ వేట మొదలైంది.
ఈ సారి హన్సిక పేరు గట్టిగా వినిపించింది. అయితే అదీ నిజం కాలేదు. ఎట్టకేలకు సంఘమిత్ర చిత్రానికి కథానాయకి కుదిరిందన్నది తాజా సమాచారం. బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని ఈ చిత్రంతో కోలీవుడ్ రంగప్రవేశం చేయనుంది. ఏఆర్.రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సబూసిరిల్ కళాదర్శకత్వం వహించనున్నారు. చిత్ర షూటింగ్ డిసెంబరులో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ ఏక కాలంలో తెరకెక్కనుంది.