రాత్రులు నిద్రపట్టేది కాదు | Aamir Khan Back in Gulshan Kumar Biopic Mogul | Sakshi
Sakshi News home page

రాత్రులు నిద్రపట్టేది కాదు

Published Thu, Sep 12 2019 12:38 AM | Last Updated on Thu, Sep 12 2019 12:38 AM

Aamir Khan Back in Gulshan Kumar Biopic Mogul - Sakshi

ఆమిర్‌ ఖాన్‌

‘‘ఒక వ్యక్తి తప్పు చేశాడా? లేదా అని నిర్ధారణ కాకముందే తుది నిర్ణయానికి రాకూడదు. తప్పొప్పులు తేలే వరకూ ఒక వ్యక్తి పని కోల్పోవడమే కాకుండా ఏ పని దొరక్కుండా ఖాళీగా ఉండాలా? నా నిర్ణయం ఒకరికి జీవనోపాధి కోల్పోయేలా చేసింది అనే ఆలోచన నాకు చాలా రాత్రులు నిద్రపట్టకుండా చేసింది’’ అని ఆమిర్‌ ఖాన్‌ అన్నారు. సంగీత దర్శకుడు గుల్షన్‌ కుమార్‌ జీవితం ఆధారంగా ‘మొఘల్‌’ అనే చిత్రం తెరకెక్కనుంది.

ఆమిర్‌ ఖాన్‌ టైటిల్‌ రోల్‌ పోషించడంతో పాటు నిర్మాణంలోనూ భాగస్వామిగా ఉన్నారు. సుభాష్‌ కపూర్‌ దర్శకుడు. అయితే ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా సుభాష్‌ కపూర్‌ౖపై వేధింపుల ఆరోపణలు (గీతికా త్యాగీ ఆరోపించారు) రావడంతో ‘మొఘల్‌’ నుంచి ఆమిర్‌ తప్పుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్ట్‌లో భాగమైనట్టు ప్రకటించారు. ‘‘గతంలో నేను తీసుకున్న నిర్ణయం ఆ సమయానికి సరైనది అనిపించింది. ఇప్పుడు మరోలా అనిపిస్తోంది.

నా మనస్సాక్షిని నమ్మి వెళ్తున్నాను. కొందరికి ఈ నిర్ణయం కరెక్ట్‌గా అనిపించకపోవచ్చు. మొన్న మే నెలలో ‘ఐఎఫ్‌టీడీఏ’ (ఇండియన్‌ ఫిల్మ్‌ అండ్‌  టీవీ డైరెక్టర్స్‌ అసోసియేషన్‌) నుంచి నాకో లేఖ వచ్చింది. ‘సుభాష్‌ కపూర్‌ కేస్‌ ప్రస్తుతం కోర్ట్‌లో నడుస్తోంది. అప్పుడే అతను దోషి అని ఓ నిర్ణయానికి రావడం సరైనది కాదు. మీ ఆలోచనను మరోసారి సమీక్షించుకోండి’ అన్నది దాని సారాంశం.

సుభాష్‌తో పని చేసిన కొందరు మహిళా అసిస్టెంట్‌ డైరెక్టర్స్, కాస్ట్యూమ్‌ డిపార్ట్‌మెంట్‌వాళ్లతో నేను, నా భార్య కిరణ్‌ తన తీరు గురించి మాట్లాడి తెలుసుకున్నాం. వాళ్లు తన గురించి మంచిగా మాట్లాడారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని తనెప్పుడూ స్త్రీలతో తప్పుగా ప్రవర్తించి ఉండడు అని చెప్పదలచుకోలేదు. అయినా తన మీద వచ్చిన ఆరోపణలు పని ప్రదేశంలో జరిగినవి కావు. అందుకే ఈ సినిమాలో మళ్లీ భాగమయ్యాను’’ అని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఆమిర్‌ ఖాన్‌.

ఆమిర్‌ నన్ను సంప్రదించలేదు: గీతికా
2014లో సుభాష్‌ కపూర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు నటి గీతికా త్యాగీ. ఆమిర్‌ తీసుకున్న తాజా నిర్ణయం గురించి త్యాగీ మాట్లాడుతూ – ‘‘గత ఏడాది ఆమిర్‌ తీసుకున్న నిర్ణయం (సినిమా నుంచి తప్పుకోవడం) అభినందించదగ్గది. కానీ ఇప్పుడు    సుభాష్‌ గురించి ఆరా తీసినప్పుడు ఆమిర్‌ ఖాన్‌గారు నన్ను సంప్రదించలేదు. సంప్రదించే ప్రయత్నం చేశారని నా వరకూ రాలేదు.

మీరు (ఆమిర్‌) అంత జాలి చూపించాలనుకున్నప్పుడు రెండువైపుల కథను పరిగణనలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఆమిర్‌ మార్చుకున్న నిర్ణయం వల్ల వేధింపుల గురించి మాట్లాడటానికి ఎవరు ముందుకు వస్తారు? ఆరోపణలు చేసిన తర్వాత నేను కోల్పోయిన పని, పడ్డ బాధ ఎవరికి తెలుసు? మన రూల్స్‌ మగవాళ్లను కాపాడేందుకు మాత్రమే ఉన్నాయి. అయినప్పటికీ పోరాటాన్ని ఆపను’’ అన్నారు.

‘‘ఒక అమ్మాయి వేధింపులకు గురైనప్పుడు బాలీవుడ్‌లో ఒక్కరికీ నిద్రపట్టని రాత్రులు ఉండవు ఎందుకో? (ఆమిర్‌ కామెంట్‌ను ఉద్దేశించి). సుభాష్‌కి మళ్లీ పని కల్పించినప్పుడు బాధితురాలిని ఎవ్వరూ పట్టించుకోరు ఎందుకో? బాలీవుడ్‌లో వేధించినవారికి సానుభూతి దొరుకుతుంది కానీ అమ్మాయిలకు మాత్రం ఎప్పుడూ దొరకదేంటో.. అర్థం కావడంలేదు’’ అంటూ వ్యంగ్య ధోరణిలో తనుశ్రీ దత్తా విమర్శనాస్త్రాలు సంధించారు.

గీతికా త్యాగీ , తనుశ్రీ దత్తా

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement