
ఆమిర్ ఖాన్
‘మీటూ’ అంటూ అన్ని సినీ ఇండస్ట్రీల నుంచి స్త్రీలు తమకు జరిగిన వైధింపుల గురించి బయటకు వచ్చి చెబుతున్నారు. వారి ధైర్యానికి మద్దతు లభిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్లతో ఇకపై కలసి పని చేయబోమని పలువురు స్వచ్ఛందంగా ప్రకటిస్తున్నారు. వికాస్ బాల్‌పై వచ్చిన ఆరోపణల కారణంగా ఆయనతో చేయబోయే ప్రాజెక్ట్ నుంచి వికాస్‌ని తప్పిస్తున్నాం అని అమేజాన్ సంస్థ పేర్కొంది. అలాగే ‘స్టాండప్ కామెడీ’ టీమ్ ఏఐబీ మీద వచ్చిన ఆరోపణల వల్ల హాట్‌స్టార్ తమతో వాళ్ల కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
తాజాగా ఈ లిస్ట్‌లోకి బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా తోడయ్యారు. ‘థగ్స్ ఆఫ్ హిందోస్తాన్’ సినిమా తర్వాత దర్శకుడు సుభాష్ కపూర్‌తో కలసి ఆమిర్ ఓ సినిమా చేయాల్సి ఉంది. తాజాగా అతని మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వినిపించే సరికి ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమిర్ ప్రకటించారు. ఈ విషయాన్ని ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు. ఆ సారాంశం ఏంటంటే... ‘‘క్రియేటివ్ ఫీల్డ్‌లో ఉంటూ సామాజిక సమస్యలకు పరిష్కారం వెతకడానికి నటులుగా మేం ప్రయత్నిస్తుంటాం.
మా నిర్మాణ సంస్థలో లైంగిక వేధింపులను అస్సలు సహించకూడదనే పాలసీ ఉంది. అంతే సమానంగా తప్పుడు ఆరోపణలను కూడా ప్రోత్సహించం. మేం త్వరలో మొదలుపెట్టబోయే ఓ ప్రాజెక్ట్‌లో ఓ వ్యక్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయి అని మాకు తెలిసింది. కేసు లీగల్‌గా నడుస్తున్నందు వలన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలనుకుంటున్నాం. పాత తప్పులన్నీ సరిచూసుకొని మార్పువైపు అడుగు వేయడానికి ఇదో ముందడుగు. చాలా ఏళ్లుగా స్త్రీలు లైంగికంగా దోచుకోబడుతున్నారు. ఇది ఆగాలి’’ అని ఆమిర్ భార్య కిరణ్ రావ్, ఆమిర్ పేర్కొన్నారు. ‘ఓ వ్యక్తి’ అని ఆయన పేర్కొన్నది సుభాష్ కపూర్ గురించే అని బాలీవుడ్ టాక్.
Comments
Please login to add a commentAdd a comment