పారిపోవడం హీరోయిజం కాదు అమీర్! | Aamir Khan is Twitter's Top Trend, Rishi Kapoor Says 'Don't Run Away' | Sakshi
Sakshi News home page

పారిపోవడం హీరోయిజం కాదు అమీర్!

Published Tue, Nov 24 2015 5:56 PM | Last Updated on Sun, Sep 3 2017 12:57 PM

పారిపోవడం హీరోయిజం కాదు అమీర్!

పారిపోవడం హీరోయిజం కాదు అమీర్!

ముంబై: దేశంలో ఉందని చెప్తున్న పరమత అసహనంపై అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ట్విట్టర్ లో తీవ్రస్థాయి చర్చనే లేవనెత్తాయి. ఇటీవల చోటుచేసుకుంటున్న అసహనపు ఘటనలతో దేశం విడిచి వెళ్లిపోదామా? అని ఓ దశలో తన భార్య కిరణ్ రావు అడిగిందని అమీర్ ఖాన్ చెప్పడం పెద్ద దుమారమే రేపుతున్నది.  ఆయన వ్యాఖ్యలను ఉత్త భయాలేనని బీజేపీ, కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేయగా, పలువురు బాలీవుడ్ ప్రముఖులు కూడా అమీర్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ట్విట్టర్ లో స్పందించారు.  బాలీవుడ్ నటులు రిషి కపూర్, పరేశ్ రావల్, అనుపమ్ ఖేర్ అమీర్ తీరును విమర్శించారు. 

రిషీ కపూర్ స్పందిస్తూ 'అమీర్ ఖాన్.. తప్పులు జరుగుతున్నప్పుడు వ్యవస్థను సరిదిద్దాలి. మరమ్మతు చేయాలి. తప్పులను సరిచేసేందుకు ప్రయత్నించాలి. కానీ పారిపోకూడదు. అలా చేయడమే హీరోయిజం అవుతుంది' అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. బీజేపీ పరేశ్ రావల్ స్పందిస్తూ ' అమీర్ పోరాటయోధుడు. ఆయన దేశాన్ని విడిచివెళ్లకూడదు. దేశంలోని పరిస్థితులను మార్చాలి. జీనా యాహా మర్నా యాహా' అని అన్నారు. 'నిజమైన దేశభక్తుడు దేశాన్ని కల్లోలంలో వదిలేసి పారిపోడు. కష్టకాలంలో మాతృదేశాన్ని వీడడు. దేశం నుంచి పారిపోవడం కాదు దేశాన్ని నిర్మించు' అని పేర్కొన్నారు.

మాతృదేశాన్ని ప్రేమించేవారు ఎవ్వరు కూడా దేశాన్ని విడిచిపోతామని మాట్లాడారని, అలా మాట్లాడితే మరోలా అనుకోవాల్సి ఉంటుందన్నారు. హిందూ విశ్వాసాలను ప్రశ్నిస్తూ అమీర్ ఖాన్ 'పీకే' సినిమా తీశారని, అయినా దేశంలోని మెజారిటీ హిందువుల నుంచి ఏనాడైనా ఆయన ఆగ్రహాన్ని చవిచూడలేదని, అంతేకాకుండా దేశమంతటా ఈ సినిమాను సూపర్ హిట్ చేశారని, ఇంకా అసహనం ఎక్కడిదని రావెల్ వ్యాఖ్యానించారు. అదేవిధంగా అమీర్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ దర్శకుడు రాంగోపాల్ వర్మ, అలనాటి హీరోయిన్ రవీనా టాండన్, వివాదాస్పద రచయిత్రి తస్లీమా నస్రీన్ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పలువురు బాలీవుడ్ నటులు అమీర్ ఖాన్ కు మద్దతుగా ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement