చెన్నై: తమిళంలో ఆసక్తికరంగా సాగిన సెలబ్రిటీ రియాల్టీ షో ‘బిగ్‌బాస్’ ముగిసింది. నటుడు ఆరవ్ విజేతగా నిలిచాడు. ఉత్కంఠభరితంగా సాగిన గ్రాండ్ ఫైనల్లో అతడిని కార్యక్రమ వ్యాఖ్యాత కమల్‌హాసన్ విజేతగా ప్రకటించారు. అతడికి రూ.50 లక్షల నగదు బహుమతిని, ‘బిగ్ బాస్’ ట్రోఫీని అందజేశారు. ఫైనల్‌కు ప్రముఖ దర్శకుడు శంకర్, నిర్మాత దిల్‌రాజు అతిథులుగా హాజరయ్యారు. వీక్షకుల నుంచి ఈ షోకు మొత్తం 76.7 కోట్ల ఓట్లు వచ్చినట్టు కమల్‌హాసన్ వెల్లడించారు.
స్టార్ విజయ్ చానల్‌లో 100 రోజులపాటు కొనసాగిన తమిళ బిగ్‌బాస్ షోలో చివరికి హౌస్‌లో ఆరావ్, హరీశ్ కళ్యాణ్, స్నేహన్, గణేశ్ వెంకట్రామన్ మిగిలారు. ఈ కార్యక్రమంలో తమ అనుభవాలను గతవారం వీరంతా కలబోసుకున్నారు. అయితే గణేశ్ వెంకట్రామన్ విజేతగా నిలుస్తాడని సోషల్ మీడియాతో ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఆరావ్ ‘బిగ్‌బాస్’ అయ్యాడు. షో నుంచి అనూహ్యంగా బయటికెళ్లిన నటి ఓవియ మిగతా పోటీదారులతో కలిసి ఫైనల్ ఎపిసోడ్‌కు రావడం విశేషం. ‘నువ్వు కొంచెం బరువు తగ్గినట్టుగా కనిపిస్తున్నావ’ని ఆరవ్‌తో ఓవియ మాట కలిపింది.
ప్రత్యేక ఆకర్షణ అదే...
బిగ్‌బాస్ హౌస్‌లో నటి ఓవియ, ఆరవ్ మధ్య చిగురించిన ప్రేమ వ్యవహారం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీరిద్దరి కారణంగా బిగ్‌బాస్ టీఆర్‌పీ రేటు బాగా పెరిగింది. ఓవియ అనుహ్యంగా బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేయడం పెద్ద సంచలనానికే దారి తీసింది. ఆమెకు అభిమానులు, సానుభూతిపరులు పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారు. జూన్ 25న 19 మంది పోటీదారులతో ప్రారంభమైన ’బిగ్‌బాస్’ సెప్టెంబర్ 30న ముగిసింది. రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని కమల్‌హాసన్ ప్రకటించడంతో రెండో సీజన్‌కు ఎవరు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తారనే చర్చ అప్పుడే మొదలైంది. కాగా, బిగ్‌బాస్ వేదికపైనే కమల్‌తో భారతీయుడు సీక్వెల్ చేయనున్నట్టు దర్శకుడు శంకర్ ప్రకటించారు.