అజిత్‌ 60వ చిత్రం ఖరారు | Actor Ajith 60th Movie Will Also Direct By H Vinoth | Sakshi
Sakshi News home page

అజిత్‌ 60వ చిత్రం ఖరారు

Published Thu, May 16 2019 7:28 AM | Last Updated on Thu, May 16 2019 7:28 AM

Actor Ajith 60th Movie Will Also Direct By H Vinoth - Sakshi

చెన్నై : నటుడు అజిత్‌ను అల్టిమేట్‌ స్టార్‌ అంటారు. ఇది ఆయనకు ఇష్టం ఉన్నా, లేకపోయినా అభిమానులు ఇచ్చిన బిరుదు ఇదే. ఇక నటుడు అజిత్‌ వేరు. వివాదాలకు దూరంగా ఉండే నటుడు. అంతే కాదు తన చిత్రాల ప్రమోషన్‌కు కూడా దూరంగా ఉండే నటుడీయన. అంతే కాదు ఇతరులతో సంబంధం లేకుండా వరుసగా చిత్రాలు చేసుకుపోయే నటుడు. ఇక ఇటీవల వరుస విజయాలతో దూసుకుపోతున్న అజిత్‌ తాజా చిత్రం విశ్వాసం రజనీకాంత్‌ చిత్రం పేటకు పోటీగా తెరపైకి వచ్చి వసూళ్ల వర్షం కురిపించింది. ప్రస్తుతం అజిత్‌ నేర్కొండ పార్వై చిత్రంలో నటిస్తున్నారు.

ఇది హిందీ చిత్రం పింక్‌కు రీమేక్‌ అన్నది తెలిసిందే. హిందీలో అమితాబ్‌ బచ్చన్‌ పోషించిన పాత్రను అజిత్‌ చేస్తున్నారు. దీనిని దివంగత నటి శ్రీదేవి భర్త బోనీకపూర్‌ నిర్మిస్తున్నారు. ఈయన అజిత్‌తో వరుసగా చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపడం విశేషం. అంతే కాదు ఈయన్ని బాలీవుడ్‌కు పరిచయం చేయాలని కోరుకుంటున్నారు. అజిత్‌ నటిస్తున్న నేర్కొండ పార్వై చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యింది. ఆగస్టు 10న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

దీంతో ఆయన తదుపరి చిత్రం ఏమిటన్న విషయంపై అందరికీ ఆసక్తి కలగడం సహజమే. మరో విషయం ఏమిటంటే అజిత్‌ ఒకే దర్శకుడితో వరుసగా చిత్రాలు చేయడం, చేసిన నిర్మాణ సంస్థకే మళ్లీ అవకాశం ఇవ్వడం ఆనవాయితీగా మారింది. ఇంతకు ముందు దర్శకుడు శివకు వరుసగా నాలుగు సార్లు అవకాశం కల్పించారు. అదే విధంగా సత్యజ్యోతి ఫిలింస్‌ సంస్థలో వరుసగా వివేగం, విశ్వాసం చిత్రాలు చేశారు. అలా మరోసారి రిపీట్‌ చేయనున్నారు. అజిత్‌ ప్రస్తుతం నటిస్తున్న చిత్రానికి హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. దీని తరువాత అజిత్‌ 60వ చిత్రానికి ఆయనకే అవకాశం ఇచ్చారన్నది తాజా సమాచారం. దీన్ని నిర్మాత బోనీకపూర్‌నే నిర్మించబోతున్నారని సమాచారం. ఇది దర్శకుడు వినోద్‌ తయారు చేసుకున్న స్క్రిప్ట్‌తో తెరకెక్కనుందని, కమర్శియల్‌ అంశాలతో కూడిన ఈ చిత్రం షూటింగ్‌ను త్వరలో ప్రారంభించి 2020లో తెరపైకి తీసుకొచ్చే విధంగా ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు తాజా సమాచారం. దీనికి జిబ్రాన్‌ సంగీతాన్ని అందించనున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement