
‘అల్లరి’ నరేష్
తొలి చిత్రం ‘అల్లరి’తోనే తన వైవిధ్యమైన నటనతో ఆకట్టుకున్నాడు నరేష్. ఆ చిత్రాన్నే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అతడు తెరపై కనిపిస్తే ఎవరికైనా కడుపు చెక్కలవ్వాల్సిందే. తన సహజమైన కామెడీ టైమింగ్‌తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నాడు. హాస్యానికి మారు పేరుగా నిలిచిన ‘అల్లరి నరేష్’ అంటే చిన్నారులకు భలే ఇష్టం. ఇప్పుడు సినిమా హీరో అయినా చిన్నప్పుడు వేసవి సెలవుల్లో ఎంతో ఎంజాయ్ చేసేవాడినని చెప్పారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే... - సాక్షి,సిటీబ్యూరో
వేసవి సెలవుల్లో..
‘పాలకొల్లు దగ్గర ఊటాడ మా అమ్మమ్మ వాళ్ల ఊరు. ఏటా వేసవి సెలవుల్లో చెన్నై నుంచి అక్కడికి వెళ్లేవాళ్లం. నాన్న ఎక్కువగా సినిమా షూటింగ్స్‌లో ఉండేవారు. నేను, మా అమ్మ, అన్నయ్య ఊటాడలో సెలవులు గడిపేవాళ్లం. బంధువులంతా అక్కడికి వచ్చేవారు. చాలా సంతోషంగా ఉండేది. అందరం కలిసి ముచ్చట్లు పెట్టుకోవడం, ఆటలాడుకోవడం, ఊరంతా తిరిగి రావడం భలే సరదాగా ఉండేది. పచ్చి మామిడి కాయలంటే నాకు చాలా ఇష్టం. తోటలోకి వెళ్లి మామిడి కాయలు కోసి తెచ్చుకునేవాళ్లం.
తాటి ముంజలు తిని తరువాత తాటికాయలను చక్రాల బండిలాగా చేసుకుని ఆడుకునేవాళ్లం. వాటితో మూడు చక్రాల బండి, నాలుగు చక్రాల బండి తయారు చేసి ఊరంతా తిరిగేవాడిని. ఊటాడలో గడపడం ఒక అనుభవం అయితే.. మరి కొద్ది రోజులు నాన్నతో కూడా గడిపేవాళ్లం. ఆయన ఇంటి దగ్గర ఉండి మాకు కేటాయించే టైమ్ చాలా తక్కువ. అందుకోసం ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవాళ్లం. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ.. అలా ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేవాళ్లం.
నాన్న మూడో సినిమా ‘ఫోర్ ట్వంటీ’ షూటింగ్ సమయంలో రాజమండ్రిలో గడిపాం. జూన్ 30 నా పుట్టిన రోజు. కానీ షూటింగ్స్ వల్ల నాన్న ఎప్పుడూ నాతో గడిపేవారు కాదు. బాధగా ఉండేది. ఐదారుగురు స్నేహితుల మధ్య ఇంట్లోనే కేక్ కట్ చేసి వేడుక చేసుకునేవాడిని. నాకు బాగా గుర్తుండిపోయిన జ్ఞాపకం... నా 14వ పుట్టిన రోజు. ఆ రోజుల్లో నాన్న ‘చిలక్కొట్టుడు’, ‘అదిరింది అల్లుడు’ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండింటిలో ఏదో ఒక సినిమా షూటింగ్ కోసం యూరప్‌లో ఉన్నారు. పుట్టిన రోజుకు నాలుగు రోజుల ముందు అన్నయ్యను, నన్ను యూరప్‌కు రప్పించారు.
‘మోబ్లాగ్స్’లో షూటింగ్ యూనిట్ మధ్య గ్రాండ్‌గా నా పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. నా చుట్టూ ఎంతోమంది.. చాలా సంతోషంగా ఫీలయ్యాను. ఇప్పటికీ నాకు అది మరిచిపోలేని జ్ఞాపకం. వేసవి సెలవుల్లో పెళ్లిళ్లకు వెళ్లడం.. చుట్టాలందరితో కలిసి భోజనం చేయడం.. సరదాగా మాట్లాడుకోవడం, అందరితో కలిసి సెల్ఫీలు తీసుకోవడం నాకు ఇప్పటికీ చాలా ఇష్టం. అవకాశం ఉంటే తప్పనిసరిగా బంధువుల ఇంటికి వెళ్తాను’ అని చెప్పుకొచ్చారు.