
సాక్షి, హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీని హత్యచేసిన నాథూరాం గాడ్సేపై సినీనటుడు నాగబాబు వివాదాస్పద ట్వీట్ చేశారు. నాథురాం గాడ్సే దేశభక్తిని శంకించలేమని, ఆయన నిజమైన దేశ భక్తుడని కొనియాడారు. మంగళవారం గాడ్సే జయంతి సందర్భంగా నాగబాబు ట్విటర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఆయన చేసిన ట్వీట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
‘ఈ రోజు నాథురాం గాడ్సే పుట్టిన రోజు. నిజమైన దేశ భక్తుడు. గాంధీని చంపడం కరెక్టా కాదా అనేది చర్చనీయాంశం. కానీ అతని వైపు వాదనలను ఆ రోజుల్లో ఏ మీడియా కూడా చెప్పలేదు. కేవలం మీడియా అధికార ప్రభుత్వానికి లోబడి మాత్రమే పనిచేసింది. (ఈ రోజుల్లో కూడా చాలా వరకు ఇంతే). గాంధీని చంపితే ఆపఖ్యాతి పాలవుతానని తెలిసినా తాను అనుకున్నది చేశాడు. నాథురాం దేశభక్తిని శంకించలేము. ఆయన ఒక నిజమైన దేశభక్తుడు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనని ఒకసారి గుర్తుచేసుకోవాలనిపించింది. పాపం నాథురాం గాడ్సే.. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్.’ అని ట్విటర్‌లో అభిప్రాయపడ్డారు. (అందుకే జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేశా)
గాడ్సేపై నాగబాబు చేసిన పోస్ట్‌పై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గాంధీని చంపిన వ్యక్తి దేశ భక్తుడు ఎలా అవుతాడు..? అంటూ కొంతమంది ప్రశ్నించగా.. అతను ముమ్మాటికీ హంతకుడేనని మరికొందరు ట్వీట్ చేశారు. ‘ఇంకా నయం డబ్బులు మీద గాంధీ బొమ్మ కాకుండా గాడ్సే బొమ్మ ఉండాలి అని చెప్పలేదు సంతోషం’ అంటూ మరో వ్యక్తి వ్యంగ్యంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment