నటుడి విడాకులపై క్లారిటీ వచ్చింది!
సాక్షి, బెంగళూరు : ఈగ, బాహుబలి చిత్రాల ద్వారా తెలుగు తెరకు సుపరిచితమైన ప్రముఖ కన్నడ నటుడు కిచ్చ సుదీప్. ఆయన తన భార్య ప్రియ రాధాకృష్ణన్‌తో 14 ఏళ్ల వివాహ బంధం తర్వాత విడాకులు కోరుతూ 2015లో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. అయితే అనంతరం ఈ దంపతులు మనసు మార్చుకున్నారు. కుటుంబ కలహాలతో ఫ్యామిలీ కోర్టు మెట్లెక్కిన ఈ సుదీప్, ప్రియలు తమ కూతురు శాన్వి కోసం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కలిసుండాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు వెల్లడించారు.
ఈ దంపతుల లాయర్ గురువారం మీడియాతో మాట్లాడుతూ.. సుదీప్, ప్రియలు తమ వైవాహిక బంధాన్ని కొనసాగించాలనుకున్నట్లు తెలిపారు. కోర్టులో కేసు వేసినప్పటి నుంచీ సుదీప్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదని చెప్పారు. భార్య ప్రియకు పెద్ద ఎత్తున భరణం ఇచ్చేందుకు కూడా సిద్ధమైన సుదీప్ కూతురు శాన్వి కోసం మనసు మార్చుకున్నారని వివరించారు. విభేదాలను పక్కనపెట్టి కలిసి జీవించాలనుకున్నట్లు రాతపూర్వకంగా తెలపగా బెంగుళూరు ఫ్యామిలీ కోర్టు వారి నిర్ణయాన్ని అంగీకరించింది. వారికి మరో అవకాశం ఇచ్చనట్లు పేర్కొన్నారు.
2001లో నటుడు సుదీప్, ప్రియలు ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి పాప శాన్వి ఉంది. అయితే కుటుంబ కలహాల కారణంగా 2015లో ఈ దంపతులు విడాకుల కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. అయితే శాన్వి కోసం తమ నిర్ణయాన్ని మార్చుకుని కలిసుండటానికి సిద్ధం కావడంతో సుదీప్ అభిమానులతో పాటు ప్రియ కుటుంబసభ్యులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.