
తమిళసినిమా: నటుడు విశాల్ వ్యక్తిగతంగా చాలా మందికి సహాయం చేస్తుంటారు. ఆపదలో ఉన్న వారికి ఆర్థికసాయం చేసి ఆదుకుంటుంటారు. అలాంటిది సడన్‌గా అయోగ్యుడిగా మారిపోతున్నారు. ఏమిటీ నమ్మడం లేదా? మీరు నమ్మినా, నమ్మకపోయినా విశాల్ అయోగ్యుడిగా మారుతుండడం నిజం. కంగారు పడకండి విషయం ఏమిటంటే ఇరుంబుతిరై చిత్ర విజయంతో మంచి జోష్‌లో ఉన్న విశాల్ తదుపరి అయోగ్య అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. తెలుగులో జూనియర్ ఎన్‌టీఆర్ నటించిన టెంపర్ చిత్రం తమిళంలో రీమేక్ కానుందనే ప్రచారం చాలా కాలం నుంచే జరుగుతున్న విషయం తెలిసిందే.
అయితే ఈ చిత్రాన్ని మైఖెల్ రాయప్పన్ శింబు హీరోగా ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో నిర్యించనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఆ చిత్రానికి విశాల్ హీరోగా మారుతున్నారు. అదే విధంగా ఏఆర్.మురుగదాస్ శిష్యుడు వెంకట్‌కుమార్ దర్శకత్వం వహించనున్నారు. అయితే నిర్మాత మాత్రం మైఖెల్ రాయప్పనే. మరో విశేషం ఏమిటంటే ఈ చిత్రం కోసం విశాల్ తన పారితోషికాన్ని తగ్గించుకున్నారట. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రంలో విశాల్‌కు జంటగా నటి రాశీఖన్నా నాయకిగా నటించనున్నట్లు సమాచారం.