
నేరం చేసినోళ్లే సిగ్గుపడాలి..!
‘‘రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరంటారు. సినిమాల్లోనూ అంతేనట! నా సంగతికొస్తే... చిత్ర పరిశ్రమలో నాకు శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉన్నారు. నేను చేయని తప్పుకు (శత్రువులకు) ఎప్పుడూ క్షమాపణలు చెప్పను. రాజీపడి పదేపదే క్షమాపణలు చెప్పే బదులు... అహంకారిగా ముద్ర వేయించుకోడమే నాకిష్టం’’ అన్నారు నటి భావన. గత ఫిబ్రవరిలో కారులో కొందరు ఆమెను లైంగికంగా వేధించిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. సదురు ఘటన వెనుక ఏదో కుట్ర ఉందనే అనుమానం వ్యక్తం చేశారు భావన.
ఇంకా ఆమె మాట్లాడుతూ – ‘‘ఓ చోటు నుంచి మరో చోటుకి కారులో తీసుకువెళ్లే డ్రైవర్‌కి ఇలా చేసే దమ్ముంటుందా? ఎలా చేయగలడు? అసలు ఎవరు ఇదంతా చేయించారు? ఎందుకు చేయించారు? ఈ ప్రశ్నలకు నా దగ్గర సమాధానం లేదు.ఈ ఘటన వెనుక నా శత్రువుల హస్తం ఉందని చెప్పడం లేదు. కానీ, కేవలం డబ్బు కోసమే నన్ను వేధించారా? అనే కోణంలోంచి ఆలోచించినా లింక్స్ కనెక్ట్ కావడం లేదు. పలు ప్రశ్నలకు నాకు సమాధానాలు కావాలి. నేను గెలిచే వరకూ పోరాడతా’’ అన్నారు. ఈ అంశంలో పలువురు సినీ ప్రముఖులు భావనకు మద్దతుగా నిలిచారు. పోలీసుల దగ్గరకు ధైర్యంగా వెళ్లి, ఘటనపై భావన ఫిర్యాదు చేసిన తీరును అభినందించారు. దీనిపై భావన మాట్లాడుతూ – ‘‘నాకే కాదు... ఎవరికైనా ఇలా జరగొచ్చు. నాకు జరిగిన అన్యాయం గురించి నేను మాట్లాడితే... ఇతరులూ మాట్లాడతారు.
ఇలాంటి ఇష్యూలను బయటపెట్టడానికి భయపడి తప్పు చేసినోళ్లకు తప్పించుకునే ఛాన్స్ ఎందుకివ్వాలి? నేరం చేసినోళ్లే సిగ్గు పడాలి. మహిళలు కాదు. నేను ఈ ఘటనపై మౌనం వహించి ఉంటే, నా అత్యంత సన్నిహితులు ఓ ఐదు లేదా పది మందికి తెలిసేది. కానీ, నలుగురిలో ఘటన గురించి మాట్లాడలేదనే అపరాధ భావంతో తల ఎత్తుకోలేక పోయేదాన్ని. తప్పు చేశాననే బాధతో ఎన్నో నిద్రలేని రాత్రులు గడపాల్సి వచ్చేది. అందుకే, కంప్లయింట్ చేశా. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను’’ అన్నారు.