
ఇప్పుడంటే హైదరాబాదీ అమ్మాయిలు చాలామంది సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ ఓ పదేళ్ల క్రితం సిటీ అమ్మాయిల కోసం సినిమాల్లో వెతుక్కోవాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఇక్కడ్నుంచి ‘తెర’ంగేట్రం చేసింది పూనమ్ కౌర్. అమీర్‌పేట్‌లో మొదలైన ఈ ‘మిస్ ఆంధ్ర’ పయాణం... ఎన్నెన్నో మలుపులు తిరుగుతూ ఆటంకం లేకుండా సాగుతోంది. అనూహ్యంగా ఇటీవల కొన్ని వివాదాల్లోనూ ఆమె పేరు వినిపించింది. ఏదేమైనప్పటికీ పరిస్థితులకు తలవంచక ప్రయాణం కొనసాగిస్తోందీ హైదరాబాదీ. ఈ నేపథ్యంలో ‘జగన్ జీత్ కౌర్’ అలియాస్ పూనమ్ కౌర్ ‘సాక్షి’తో పంచుకున్న విశేషాలివీ...
హిమాయత్‌నగర్: నేను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగాను. స్కూల్, కాలేజీ అంతా ఇక్కడే. హైటెక్‌సిటీ, ట్యాంక్‌బండ్, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, చిలుకూరి బాలజీ టెంపుల్ అంటే అమితమైన ఇష్టం. స్కూల్‌లో అల్లరి చేయడంలో, కళాశాలలో ర్యాగింగ్‌లో మనమే టాప్. అమ్మ ముద్దుగా ‘అత్త’ అని పిలిస్తే, అన్నయ్య ఆప్యాయంగా ‘బచ్చీ, చోటీ’ అంటే.. ఫ్రెండ్స్ ‘పీకే (పూనమ్ కౌర్)’ అని పిలుస్తారు.
అలా ఐ లవ్ యూ
అమీర్‌పేట్‌లోని విద్యోదయ స్కూల్లో చదువుకున్నాను. ఎనిమిదో తరగతిలో ఉండగా నిన్ను చాలామంది లవ్ చేస్తున్నారే అని ఫ్రెండ్స్ చెప్పేవారు. ఓ రోజు సరదాగా లవ్ చేసేవాళ్లు నాతో చెప్పాలి. కానీ మీకు చెప్పడమేంటి? అన్నాను. అంతే మరుసటి రోజు ఓ అబ్బాయి ఇంటర్వేల్ సమయంలో క్లాస్‌రూమ్‌లో మోకాలిపై నిలబడి గులాబీతో ‘ఐలవ్యూ పూనమ్’ అని ప్రపోజ్ చేశాడు. పెద్దగా నవ్వి.. రోజ్, లెటర్ తీసుకొని వెళ్లిపోయా. నాకు వచ్చిన ప్రపోజల్స్‌లో ఇదే స్వీట్ ప్రపోజ్. చదువులో యావరేజ్ స్టూడెంట్‌ని. చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ అంటే భయం. విల్లామేరీ కాలేజీలో ఫస్ట్ ఎంపీసీ తీసుకున్నప్పటికీ.. ఆ భయంతోనే సీఈసీకి షిఫ్ట్ అయ్యాను. కాలేజీకి బంక్ కొట్టి ఫ్రెండ్స్ ఇంట్లో సినిమాలు చూసేవాళ్లం. ఖాళీ సమయంలో పుస్తకాలు చదువుతాను. బాగా నచ్చిన బుక్ ‘సోల్ పవర్’.
అమ్మ త్యాగం మరువలేనిది..
అమ్మమ్మది నిజామాబాద్ జిల్లా బోధన్. నాన్న నాకు నాలుగేళ్ల వయస్సు ఉండగా మరణించారు. అప్పుడు అమ్మ వయస్సు 26. అప్పటికే నేను అన్నయ్య, చెల్లి. మాకోసం అమ్మ తన జీవితాన్ని త్యాగం చేసింది. మమ్మల్ని పెంచడానికి తనెంతో కష్టపడింది. పండుగ సెలవులకు మమ్మల్ని బోధన్ తీసుకెళ్లేది. మా అమ్మమ్మ వాళ్లు జమీందార్లు. అక్కడి పచ్చని పొలాలంటే నాకు చాలా ఇష్టం. నాకు చాలా భక్తి. మా నానమ్మ ప్రతిరోజు 4గంటలకే నిద్ర లేపి, పూజ చేయించేది. అదే నాకు అలవాటైపోయింది. వీలైనప్పుడు చిలుకూరి బాలాజీ టెంపుల్‌కి వెళ్తుంటాను.
అవకాశమిస్తానని రమ్మన్నాడు..
కొన్నేళ్ల క్రితం ఓ పెద్ద నిర్మాత మా ఇంటికొచ్చాడు. ‘నువ్వు చాలా బాగా నటిస్తావ్. నీకు పెద్ద హీరోల సరసన చాన్స్ ఇప్పిస్తాను. ఒకసారి నన్ను కలువు’ అని చెప్పాడు. వారం తర్వాత అమ్మను తీసుకొని ఆయన దగ్గరకు వెళ్లాను. అమ్మను వెంట తీసుకెళ్లానని కనీసం సరిగ్గా మాట్లాడనూ లేదు. ఇప్పటి వరకు ఒక్క సినిమాలో అవకాశమూ ఇవ్వలేదు. టాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్స్ సక్సెస్ అయ్యారు. అయితే అందరూ పైకి సంతోషంగా ఉన్నా... లోలోపల ఎంతో సఫర్ అవుతుంటారు. హీరోల విషయంలో అదేం ఉండదు. పెళ్లి సమయానికి వారు మ్యారేజ్ చేసేసుకుంటారు. కానీ హీరోయిన్స్ అలా కాదు. జీవితాన్ని త్యాగం చేయాల్సి వస్తుంది.
అదో గుణపాఠం..
సమాజంలో ఏదైనా అన్యాయం జరిగితే ప్రశ్నించాలని అనిపిస్తుంది కదా... ఆ ఆలోచనతోనే ట్వీటర్‌లో ఓ పోస్ట్ చేశాను. అంతే.. నాపై ఒక్కసారిగా మూకుమ్ముడి దాడి జరిగింది. నేనేం ఫేమస్ అయ్యేందుకు ఆ ట్వీట్ చేయలేదు. మహిళా సాధికారత గురించి మహిళలు, మహిళా సంఘాలు ఎవరూ ఆ సమయంలో నాకు అండగా నిలవలేదు. నా కుటుంబమే నావెంట ఉంది. ఆ తర్వాత అర్థమైంది... సమాజంలోని ఎంతో మంది స్వలాభం కోసం మనలాంటి వాళ్లను వాడుకుంటారని. వాళ్లు ఫేమస్ అయ్యేందుకు మరో వృత్తిలోని వారిని రోడ్డుకు ఈడ్చుతారని. ఏదేమైనా ఇక అలాంటి అనవసర వివాదాలు వద్దనుకున్నాను. అందుకే ట్వీటర్ అకౌంట్‌ను డీయాక్టివేట్ చేశాను.
ఫటాఫట్
► ఇష్టమైన హీరోలు షారూక్‌ఖాన్, చిరంజీవి. హీరోయిన్లు అనుష్క శెట్టి, అనుష్కశర్మ, శ్రీదేవి, సౌందర్య.
► నచ్చిన పెర్‌ఫ్యూమ్ డేవిడ్ ఆఫ్ కూల్ వాటర్స్, బుర్‌బెర్రీ.
► జ్యూవెలరీ అంటే ఇష్టం. ఫంక్షన్లకు హ్యాండ్‌మేడ్ జ్యూవెలరీ ధరిస్తాను.
► నేను పెద్ద ఫుడీని. కానీ వంట అస్సలు రాదు. హైదరాబాదీ బిర్యానీ, ఖుర్బానీ కా మీఠా మై ఫేవరేట్.
► ఐస్‌క్రీమ్స్ ఇష్టం.. చాక్లెట్స్‌కి దూరం.
► ఫ్రెండ్స్‌తో లాంగ్‌డ్రైవ్‌కి వెళ్తుంటాను.
► చిన్నప్పుడు నేను బొద్దుగా ఉండేదాన్ని. బుగ్గలు చాలా పెద్దగా ఉండేవి. అందరూ ‘బుల్‌డాగ్’ అంటూ బుగ్గలు నొక్కేవాళ్లు.
► రంజాన్ సమయంలో చుడీబజార్ వెళ్తుంటాను. చార్మినర్ దగ్గర సందడి ఆస్వాదిస్తాను.
► హైదరాబాద్ తర్వాత నచ్చే సిటీ లండన్.
► చిన్నప్పటి ఫ్రెండ్స్ నీలిమా, రాజేష్‌లతో నా కష్టసుఖాలు పంచుకుంటాను.
► వీలు కుదిరినప్పుడల్లా ఫ్రెండ్స్‌తో బ్యాడ్మింటన్ ఆడుతుంటాను.
► హ్యాండ్‌లూమ్ శారీస్ ఎక్కువగా ధరిస్తాను.
Comments
Please login to add a commentAdd a comment