
బహుభాషా నటీమణుల్లో నటి పూర్ణ ఒకరని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మాతృభాష మలయాళం అయినా తమిళం, తెలుగు భాషల్లోనూ నటిగా ఈ బ్యూటీకి మంచి పేరు ఉంది. మునిమాండి విలంగియల్ 3ఆమ్ ఆండు చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా రంగప్రవేశం చేసిన పూర్ణ ఆ తరువాత కందకోట్టం, ఆడుపులి, సవరకత్తి, కొడివీరన్ చిత్రాల్లో నటించారు. అయితే ఇటీవల తన బాణీని మార్చుకున్నారు.
కథానాయకిగానే నటిస్తానని పట్టుపట్టకుండా నటనకు అవకాశం ఉన్న ఎలాంటి పాత్రనైనా నటించడానికి సిద్ధం అంటున్నారు. మంచి డాన్సర్ అయిన పూర్ణ ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ జరిగింది, జరుగుతోంది, జరగనుంది అంతా ముందే రాసిపెట్టి ఉంటుందనే వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చారు. నిజం చెప్పాలంటే తాను సినిమాల్లోకి వస్తానని, కథానాయకినవుతానని ఊహించలేదన్నారు. ఎవరి సపోర్టు లేకుండా ఈ స్థాయికి చేరుకున్నానని అన్నారు.
మహిళలకు రక్షణ కల్పిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నా, స్త్రీ ఒంటరిగా బయట ప్రపంచంలో సేఫ్‌గా తిరిగే పరిస్థితి లేదని పేర్కొంది. తన గురించే చెప్పాలంటే షూటింగ్‌కుగానీ, వేరే కార్యక్రమానికికానీ తనను ఒంటరిగా పంపడానికి తన తల్లి భయపడుతుందని చెప్పారు. తనతో అమ్మ గానీ, అక్క గానీ వస్తుంటారని తెలిపారు. ఎందుకంటే ఇప్పుడు మహిళలకు జరుగుతున్న సంఘటనలను చూసి వారు భయపడుతుంటారు. తాను డాన్స్ క్లాస్‌కు వెళ్లినా ఎవరో ఒకరు తనకు తోడుగా వస్తారన్నారు.
ఇప్పుడు సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను చూస్తుంటే ఎవరిని నమ్మాలో? ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మహిళల విషయంలో తప్పు చేసిన వారికి సరైన శిక్ష పడితే తప్పు జరగదని.. అప్పుడే అత్యాచారాలు తగ్గుతాయని అన్నారు. స్త్రీలు ఎలాంటి భయం లేకుండా స్వేచ్ఛగా బయట తిరగగలుగుతారని చెప్పారు. తప్పు చేస్తే విదేశాల్లో కఠిన శిక్షలు ఉంటాయని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదని నటి పూర్ణ పేర్కొన్నారు.