
సాక్షి, ముంబై: బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి కాపీ, పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది. ఆస్కార్ అవార్డు పొందిన పారాసైట్ సినిమాను ప్రశంసలతో ముంచెత్తుతూ మంగళవారం ట్వీట్ చేసింది. తీరా అది ఈ అమ్మడు సొంత తెలివి కాదని తెలిసి నెటిజన్లు ఈమెపై ఫైర్ అవుతున్నారు. న్యూయార్క్ రచయిత జేపీ బ్రామర్ పారసైట్ సినిమా గురించి రాసిన ట్వీట్‌ను ఉన్నదున్నట్లు దించేసి వివాదంలో చిక్కుకుంది.
‘పారసైట్ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. అబద్దాలు చెప్పి ఉద్యోగాలు సంపాదించినా, వాళ్ల నటనకు నేను ఫిధా అయ్యా. తెలివితేటలున్నా, పేద కుటుంబం కావడంతో వాళ్ల వాస్తవాలను దాచిపెట్టి చివరకు ఓ ధనిక కుటుంబం చేతనే తమ ప్రతిభతో ఉద్యోగం సంపాదిస్తారు’ అని ఊర్వశీ మంగళవారం ట్వీట్ చేసింది. ఊర్వశీ ట్వీట్‌పై జేపీ బ్రామర్ స్పందించారు. కాపీ పేస్ట్ చేసేటప్పడు కనీసం గ్రామర్ తప్పులు కూడా సరిచేసుకోకుండా ఉన్నదున్నట్లు కాపీ చేయడం ఏంటని ప్రశ్నించారు. ‘ఎవరిదైనా ట్వీట్ కాపీ చేసేటప్పుడు అందులో మార్పులు చేయాలి. కనీసం గ్రామర్ తప్పులు లేకుండా చూసుకోవాల’ని ఆయన హితవు పలికారు.
ఈ ట్వీట్ల వ్యవహారంపై ఊర్వశీ ఫాలోవర్స్ కూడా ఆమెపై గుర్రుమంటున్నారు. ఆమెకు అసలు బ్రెయిన్ లేదని కొందరు స్పందిస్తుంటే, మరికొందరేమో ఇది ఊహించిందే అని అంటున్నారు. గతంలోనూ మోడల్ జిగి హడీడ్, ప్రధాని మోదీ ట్వీట్లను కూడా కాపీ, పేస్ట్ చేసి ఆమె వివాదాలపాలయ్యారు.