చిక్కుల్లో బొద్దుగుమ్మ 'బుజ్జిమా'
చెన్నై: బన్నీ మూవీ సరైనోడులో... సాంబారు చబ్బీ బ్యూటీ, రాజుగారి గది చిత్రంలో బుజ్జిమాగా ఆకట్టుకున్న తమిళ నటి విద్యుల్లేఖ రామన్ గుర్తుందా...డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న విద్యు విదేశంలో చిక్కుల్లో పడ్డారు. స్నేహితులతో కలసి ఇటీవల ఆస్ట్రియాలోని వియన్నా పర్యటనకు వెళ్లిన ఆమె బ్యాగ్ చోరీకి గురైంది. దీంతో తనకు సాయం చేయాల్సిందిగా ప్రధాన మంత్రిత్వ శాఖను, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను ట్విట్టర్ లో వేడుకున్నారు. వియన్నా సందర్శన తనకు చేదు అనుభవాన్ని మిగిల్చిందనీ, డబ్బు, పాస్ పోర్ట్ , ఇంకా విలువైన వస్తువులను కోల్పోయానంటూ ట్విట్టర్ లో వాపోయింది. నిస్సహాయ స్థితిలో ఉన్న తనను ఆదుకోవాల్సిందిగా వరుస ట్వీట్ల ద్వారా అభ్యర్థించారు.
సీనియర్ నటుడు మోహన్ రామన్ కుమార్తె అయిన విద్యు .. వియన్నాలో తాను ఉన్నహోటల్ లాబీలో ఎవరో తన బ్యాగును దొంగిలించారని అందులో తన పాస్‌పోర్ట్, కార్డులు, డబ్బు.. తదితరాలు ఉన్నాయంటూ ట్విట్ చేశారు. ఓ వ్యక్తి తన వద్దకు వచ్చి అడ్రస్ ఏంటని అడుగుతూ దృష్టి మళ్లించే ప్రయత్నం చేశాడని ఈ లోపుగా మరో వ్యక్తి వచ్చి బ్యాగును దొంగిలించాడని చెప్పారు. హోటల్‌లోని సీసీటీవీ పుటేజ్ ను పరిశీలించడానికి హోటల్ యాజమాన్యం సమ్మతించడంలేదని ఆరోపించారు. దీంతో చెన్నైలోని ఆమె కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతి చెందారు. ప్రభుత్వం సహకరించి తమ కుమార్తెను స్వదేశానికి రప్పించాలని కోరారు.
కాగా తమిళ, తెలుగు చిత్రాల్లో ఫ్రెండ్ పాత్రలకు చిరునామాగా మారిన విద్యుల్లేఖా రామన్ 'ఎటో వెళ్లిపోయింది మనసు, రామయ్యా వస్తావయ్యా' భలే మంచి రోజు' తదితర చిత్రాలలో ప్రేక్షకులను మెప్పించారు. అనంతం ఈ బొద్దుగుమ్మ రాజుగారి గది సినిమాలోని హాస్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
.@SushmaSwaraj My bag has been stolen with passport, cards & currency in my hotel lobby. Need to contact the Indian embassy asap in Vienna.
— Vidyu (@VidyuRaman) 3 May 2016
.@PMOIndia My bag has been stolen with passport, cards & currency in my hotel lobby. Need to contact the Indian embassy asap in Vienna. Sos
— Vidyu (@VidyuRaman) 3 May 2016