నేను నమ్మిన నిజాలే వంగవీటి సినిమా: వర్మ
విజయవాడ సిటీ:తాను నమ్మిన, తనకు తెలిసిన నిజాలు ‘వంగవీటి’ సినిమాలో ఉంటాయని సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్‌సహా పలువురిని కలవనున్నట్టు తెలిపారు. చిత్రీకరణకు ముందే సంచలనం రేపుతున్న వంగవీటి సినిమా నిర్మాణానికి ముందు అప్పటి పరిస్థితులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న, తెలిసిన వారిని కలిసేందుకు శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం హత్య మొదలు వంగవీటి రంగా హత్య వరకు తన చిత్ర కథాంశం ఉంటుందన్నారు. తన సినిమాలో నిజం మాత్రమే ఉంటుందే తప్ప ఏ ఒక్కరినో కించపరచడం, తప్పు చేసినట్టు చూపించడం ఉండదన్నారు. అప్పట్లో చోటుచేసుకున్న ఘటనలు, కారణాలు, పరిస్థితులు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం పలువురిని కలవాల్సి ఉందని, అయితే, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధాకష్ణలు తమను కలవవద్దని చెప్పినట్టు తెలిపారు. కలవాలనుకోవడం తన ఇష్టమని, కలవవద్దనుకోవడం వారి ఇష్టమని ఆయన స్పష్టంచేశారు. అప్పటి పరిస్థితులతో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉన్న వారి నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు.
వారిలో చిన్నపాటి వ్యక్తి మొదలు పేరొందిన నాయకులు, సన్నిహితులు ఉండొచ్చని చెప్పారు. ఎవరిని కలిసి, ఏం మాట్లాడతాననేది ఇప్పుడు చెప్పనన్నారు. మూడు రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కర్నీ కలవనున్నానన్నారు. కలిసిన తర్వాత అవసరమైన పక్షంలో చెపుతానని తెలిపారు. తాను విజయవాడ కాలేజీలో చదివే రోజుల్లో జరిగిన అంశాలు అయినందున సినిమా తీయాలని నిర్ణయించుకున్నానన్నారు. సినిమా తీయాలనుకున్నప్పుడు ఏ ఒక్కరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, రక్తచరిత్ర సమయంలో పరిటాల సునీత అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. వంగవీటి సినిమా వల్ల కొందరికి, తనకు తప్ప ఆయా వర్గాల మధ్య విభేదాలు ఎందుకొస్తాయని ఆయన ప్రశ్నించారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముంబైలోనే సినిమా షూటింగ్ జరుపుతానని అన్నారు. మరో పది రోజుల్లో సినిమా ప్రారంభించి జూన్ మొదటి వారంలో విడుదలకు నిర్ణయించామని చెప్పారు. విలేకరుల సమావేశంలో వంగవీటి సినీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు.